ALUMNI (పూర్వ విద్యార్ధి) అన్నయ్య కూతురు సుమేధ పెళ్ళికని అమెరికాలో స్థిరపడిన రమణ భార్య, పిల్లల్తో సొంత ఊరుకొచ్చాడు. నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇండియాకి రావడం. అయినవాళ్ళు అందరినీ కలవడం కోసం కొంచెం ఎక్కువ రోజులు సెలవు తీసుకొని వచ్చాడు, దానికి తోడు పిల్లలకి కూడా సెలవులే. అన్నీ కలిసి వచ్చాయ్ . ఆ ఊర్లో రమణ వాళ్ళ కుటుంబం తెలియని వాళ్ళుండరు. రమణ వాళ్ళ నాన్న సీతాపతిరావు ఊరంతటికీ బంధువు. అందరి కష్టం ఆయన కష్టం. ఆ ఊరు ప్రగతికి ముఖ్యకారకుడు సీతాపతిరావే. మరి అంతటి ఆయన మనుమరాలు పెళ్ళంటే ఇంక చెప్పాలా! పెళ్ళి ఊరంతా పండగలా జరుపుకున్నారు. రమణ భార్య మూణ్ణిద్దర్లకని పెళ్ళికూతురుతో పెళ్ళికొడుకు వాళ్ళింటికి వెళ్ళింది. పెళ్ళి హడావిడి తగ్గి కొంత తీరిక దొరకడంతో అదేఊర్లో మెడికల్ షాపు నడుపుతున్న తన చిన్నప్పటి స్నేహితుడు పార్ధసారధి దగ్గరకొచ్చాడు రమణ. “రారా, రమణా. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయినట్టున్నారు. హడావుడి తగ్గినట్టేనా?” పార్ధూ పరామర్శ. “ఇవాళేరా కొంచెం తీరిక దొరికింది. ఉద్యోగాల వాళ్ళందరూ వెళ్ళి పోయారు. పెద్దవాళ్ళని పోనివ్వట్లేదు నాన్న. ఆయన సంగతి నీకు తెలుసుగా!...