------------ చిరు స్మరణ ----------
బాల్యం అపురూపం… అది ఎవరికైనా అమూల్యమైన అనుభూతుల్ని మిగుల్చుతుంది.
కారణం బాల్యం లోనే మనకు ఈ ప్రపంచం పరిచయమౌడం వల్లనేమో?
ఆ వయసులో కొత్తగా పరిచమయ్య ఏ విషయమైనా చిరకాలం సుస్ధిరంగా బాంకు లాకర్లో ఉన్నట్లు ఉంటాయి.
ఒక్కసారి ఆ లాకర్ తెరిచి తరచి చూడండి మీ గతాన్ని.
దొరుకుతుంది ఒక ఆహ్లాద సమాహారం…. గని.
తోడుకున్న వారికి తోడుకున్నంత.
అట్లాంటి నా బాల్యపు ఆహ్లాద సమాహారం లో నిలిచి పోయి తరచు నన్ను పలకరిస్తూంటుంది -
“కోట్రత్తమ్మ ఇడ్లీ”.
మా చిన్నప్పుడు మా చుట్టు ప్రక్కల నాలుగు, ఐదు వీధుల్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం కోట్రత్తమ్మ ఇడ్లీ. అవి తినని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదు.
ఆ ఇడ్లీ రూపుని వర్ణించడానికి కొత్తగా ఏమీ లేదు. తెల్లగా, పల్చగా, శుచిగా - శుభ్రంగా ఉంటాయి. వర్ణించాల్సిదల్లా వాటి రుచినే.
నేను జీవితంలో ఊహ వచ్చినప్పుడు రుచి చూసిన మొట్టమొదటి ఇడ్లీ అనే పదార్ధం - కోట్రత్తమ్మ ఇడ్లీనే. అలా నేను స్కూలు చదువు ముగించుకొని కాలేజి లోకి పాదం మోపే వరకు కోట్రత్తమ్మ ఇడ్లీని ఆస్వాదించాను.
ఇంతగా నన్నూ , ఆ పేట నివాసుల్ని ప్రభావితం చేసింది ఆమె చేసిన ఇడ్లీ రుచే.
ఆమె ఇడ్లీ గురించి విని ఆమె యింటికి వెళ్ళిన వాళ్ళకి ఇంటి గడప లోనే ముక్కు పుటాలకు తగిలే విస్తరాకుల పరిమళం, కారప్పొడి ఘాటు, హాలంతా ఆవరించిన తాలింపు ఆవిరి స్వాగతం పలుకుతాయి.
పల్చగా వ్రేళ్ళతో మడత పెట్టగానే విరుగుతూ ఒరుగుతూ చట్ని కారప్పొడి మేళవింపుతో అంగిట చేరే అమృత గుళిక - కోట్రత్తమ్మ ఇడ్లీ.
ఆవిర్లూరే ఇడ్లీ చేత పట్టుకొని ఊదుకుంటూ తినే వాళ్ళ ప్రక్కనే నిలబడి ఉన్నవాళ్ళకిి లలాట లిఖితమైన ఆ పదార్ధం చేతికి అందే వరకు నోరు ఒక ఊట బావే.
చేతికి చేరి తినే వాడి దాడి కోసం వేచివున్న ఇడ్లీ , కారప్పొడి, చట్నీ, ఇప్పటి కాలం వాళ్ళకు అర్ధమయ్యేలా చెప్పాలంటే - అభిమాన నటుడి సినిమా మొదటి రోజు షో టిక్కెట్ చేతిలో పడ్డట్లు.
****************
నేనింకా బడిలో చేరే వయసు రాక (అప్పుడు 5 సం” ) అమ్మా నాన్నల చాటు బిడ్డగా పెరుగుతున్న రోజుల్లో ఒకరోజు నాన్నతో ఇడ్లీ తేవడానికి వెళ్ళినప్పుడు చూసాను - కోట్రత్తమ్మ ఇడ్లీ.
అప్పటి వరకు నాకు తెలియదు అవి ఒక ఇంట్లో చేసి అమ్ముతారని. ఆ రోజు నాన్నకి ఆఫీసు వెళ్డానికి కొంచెం ఆలస్యమయి, తను అక్కడ తిని, ఇంట్లో వాళ్ళకోసం నా చేతికిచ్చి పంపాలని నన్ను వెంట తీసుకెళ్ళారు.
“వాడికేం తెల్సు పట్టుకు రావడం. వీధిలో ఎక్కడన్నా పడేసుకున్నా, ఎవరైనా ఒక్కటి నెత్తిన మొట్టి లాక్కున్నా ఏడుస్తూ ఇంటికొస్తాడు” అని అమ్మ నాక్కలగబోయే కష్టాల్ని ఊహించి పూర్తిగా ఏకరువు పెడ్తూంటే “వాడ్ని మన గుమ్మం దగ్గర దింపి వెళ్తాను. సరేనా? రా .. రా .. రమణా” అంటూ నాన్న నా చేయి అందుకోడం కళ్ళముందు నిలిచి పోయిన అపురూప ఙ్ఞాపకం.
కనిష్ట సంతానమంటే అంత గారబం? అమ్మలకి.
ఆ తర్వాత చాలాసార్లు నాన్నతో వెళ్ళడంతో నేను ఫలానా వాళ్ళ అబ్బాయిగా కోట్రత్తమ్మ కుటుంబం మొత్తానికి తెల్సి పోయాను.
వాళ్ళిల్లు ఆసాంతం నాకు చాలా చాలా సొంతమైపోయింది.
*************
కోట్రత్తమ్మ ఇల్లు మేముండే ఇంటికి తూర్పు వాకిలి వైపు ఉంటుంది. మా యిల్లు (అద్దె ఇల్లే లేండి - సొంతదారులు మాచిరాజు వారు) పడమర వీధి - తూర్పు వీధి రెండు హద్దులుగా కలిగి ఉండేది. నడకంతా పడమర వీధి నుండే. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే తూర్పు వాకిలి వాడతాం. తూర్పు వాకిలి వైపు వెళ్ళి మెట్లు దిగామంటే ఎదురూగ్గా కోట్రత్తమ్మ ఇల్లు రోడ్డు అవతల.
నాన్న చేయి పట్టుకొని రోడ్డు దాటినప్పుడు కష్టం తెలిసేది కాదు. నాన్న రోడ్డు దాటేసి నన్ను దాటమన్నప్పుడూ, నన్ను కనిపెడుతూ, ముందు నన్ను దాటమన్నప్పుడూ తెలియలా, నాన్న తాపత్రయం అంతా నన్నొక సమర్ధుడుగా చేయాలనేనని.
దాటే ప్రయత్నం మాని కాళ్ళు నేలకేసి కొడుతూ నాన్న ఊతం కోసం చూసేవాడ్ని.
నా అంతట నేను తూర్పు వీధి మెట్లు దిగి,రోడ్డు దాటి, కోట్రత్తమ్మ ఇల్లు గడప ఎక్క గలగడం నేర్పేసాడు నాన్న.
అమ్మ కడుపులో పెట్టుకొని పెంచితే, నాన్న కళ్ళల్లో పెట్టుకొని పెంచుతాడు - అందుకు నేను సాక్షి.
మెట్లు ఎక్కేటప్పుడు ఒక చేత్తో నాన్నవేలు, రెండో చెయ్యి మోకాలు మీద - ఒకటి, రెండు, మూడు…. నాలుగు లెక్క పెట్టాలో, కూడదో తెలియదు… ఎప్పుడూ ఇదే పరిస్థితి…. ఎందు కంటే నాలుగో మెట్టూ, గడప కలిసే ఉంటాయి.
ఆ మెట్లకి అటో అరుగు, ఇటో అరుగు.
వీధి తలుపుల ప్రక్కన దీపాల గూళ్ళు.
ఇంటి ముందు ముగ్గు, గడప లోపల హాలు ముందు ముగ్గు.
గడప దాటగానే పది అడుగుల దూరంలో ఇంకో గడప….. అదే కోట్రత్తమ్మ ఇడ్లీ ఫాక్టరీకి ప్రవేశ ద్వారం, హాలు గోడ కి మళ్ళీ దీపాల గూళ్ళూ , వాటిలో కన్పడే గోపాల్ పళ్ళపొడి పొట్లం, వేప పుల్లలు, విరిగిన నాలిక బద్ద, అగ్గి పెట్టె వగైరాలు.
ఆ ప్రవేశ ద్వారంకి ఒక ప్రక్క రెండు రోళ్ళు - ఒకటి పెద్దది మినప్పప్పు రుబ్బుకుందుకు, ఇంకోటి చిన్నది కారంపొడి, మిర్చి ఇట్లాంటివి రోకలితో దంచుకుందుకు.
ప్రవేశ ద్వారం దాటగానే సుమారు ఓ 20 x 15 అడుగుల హాలు, ఆ పైన వేరే గదులు.
హాలు చివర తలుపుకు ప్రక్కగా ఉన్న కిటికీ క్రింద రెండు కట్టెల పొయ్యిలు, వాటి మీద ఇడ్లీ వండే అల్యూమినియం పాత్రలు.
పొయ్యిలకు కొంచెం దూరంగా ఇవతలకి పెద్ద చెక్క పీట - కోట్రత్తమ్మ సింహాసనం.
ఆ సింహాసనానికి చేతికి అందుబాటులో ఉండేట్లు చట్నీ గిన్నె, కారప్పొడి జాడి, ఇడ్లీలు కట్టడానికి ఉపయోగించే మోదుగ ఆకులు, పైన కొక్కేనికి వ్రేళ్ళాడుతూ ఒక కొస చేతికి అందుబాటులో ఉండే దారపు ఉండ.
జంటగా ఉన్న మోదుగ ఆకులు విడతీసి పక్క పక్కన పెడ్తున్నప్పుడు వచ్చే గంధం - వాసన అంటే తక్కువ చేసినట్లే - ;
వేడి వేడి ఇడ్లీల తాలూకు ఉడుకు పొగ నిలబడి ఉన్న వాళ్ళని ముఖం దగ్గరగా వచ్చి
చేసే పలకరింపు.
**********
తల్లిదండ్రులు పెట్టిన పేరు కోటిరత్నం, పెళ్ళి తర్వాత కోటిరత్నమ్మ, ఆమె అమ్మే ఇడ్లీలు కోట్రత్తమ్మ ఇడ్లీలు — ఈ పరిణామాలు అప్పట్లో నా ఊహక్కూడా రాని విషయాలు.
అన్నీ అమరిన ఇంట్లో పుట్టిన బిడ్డలంటే జాలి పడాలి, ఎందుకంటే దేనికీ వెతుక్కోవాల్సిన అవసరం లేనిచోట వెతుక్కునే వారెవరు?
అవసరం అన్వేషణకి దారి తీస్తుంది.
అవసరం - చిత్తశుధ్ధీ కలిస్తే వచ్చే ఫలితం ఉత్తమంగా ఉంటుంది - దాన్నే నేనంటాను “కోట్రత్తమ్మ ఇడ్లీ”.
కోట్రత్తమ్మకి ఆ అవసరమే ఇడ్లీలు అమ్మడం వైపు నడిపించింది. ఆమె ఏ వృత్తి విద్యా శిక్షణలూ పొందలేదు; వ్యాపార దక్షత, సమయ పాలన, ఖర్చుల నియంత్రణ, ఉత్తమ నాణ్యత - ఇట్లాంటి మాటలు వెలుగు చూడక ముందే వాటిని పుణికి పుచ్చుకొని పుట్టిన స్త్రీ కోట్రత్తమ్మ.
పుట్టిన తర్వాత వంట పట్టిచ్చుకున్న వాళ్ళనేమంటారు?- ఓ ఇంద్రా నూయి? ఓ చంద్రా కొచ్చర్ ? శిఖా శర్మ? అరుంధతి బట్టాచార్య? - వీళ్ళంతా - తయారు కాబడ్డ కోట్రత్తమ్మలు?
శుచి-శుభ్రం, రుచి-నాణ్యత ఉన్న ఇడ్లీకి బ్రాండ్ అంబాసిడర్ - కోట్రత్తమ్మ.
ఇప్పటి మీడియా అప్పుడుండుంటేనా కోట్రత్తమ్మ యింటి చావడిలో ఫ్రేమ్ కట్టించిన “డాక్టరేట్ ఇన్ - మేక్ ఎ లివింగ్ ఇన్ ఇడ్లీ సెల్లింగ్ “ సర్టిఫికెట్ వ్రేళ్ళాడుతూ నా కంట తప్పక పడి ఉండేది.
************
కోట్రత్తమ్మ భర్త మస్తాన్ . వయసుతో పాటు పేరుకు మర్యాద చేరి మస్తానయ్య అయ్యాడు. చాలా అనుకూలవంతుడైన పతి.
భార్య చెప్పుచేతల్లోనే మెలగుతాడు, ఒక్కచుట్ట కాల్చే విషయంలో తప్ప.
రాత్రి నానబెట్టిన మినపప్పు, చట్ని పప్పు రుబ్బడం, బజారు నుండి సరుకులు తీసుకు రావడం లాంటి మగ పనులే (ఆ రోజుల్లో) కాకుండా, భార్యకి ఇడ్లీల వ్యాపారంలో చాలా చేదోడు వాదోడుగా ఉంటాడు. నేను చూసిన మొదటి పప్పురుబ్బే మగాడు - మస్తానయ్య..
రెండో మగాడు N T R - గుండమ్మకధ సినిమాలో.
భార్యాభర్తలిద్దరూ తెల్లవారుఝామునే లేచి పనులు కానిచ్చుకొని, స్నానంచేసి పదిమంది ఉపాహారార్తిని తీర్చే ఇడ్లీ తయారీలో పడ్డారంటే నాలుగు గంటలు ఎట్లా గడిచినయ్యో కూడా తెలియదు. వచ్చే జనం, పోయే జనం, వేసే వాయ, తీసే వాయ - చూడాల్సిందే తప్ప చెప్పనలవి కాదు.
కోట్రత్తమ్మకి వ్యాపార మెళకువలు బాగా తెలుసని మా అమ్మ అంటూండేది. (Kotrathamma knows not only making but also selling the product).
ఒకటి రెండు సార్లు నేను తెచ్చిన ఇడ్లీల్లో కొన్ని చల్లటివి కొన్ని వేడివి వచ్చినప్పుడు అమ్మ ఆమాట అన్నట్లు గుర్తు.
అమ్మకి కోట్రత్తమ్మ దగ్గర నచ్చే గొప్ప విషయం ఆమె శుచి శుభ్రత. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రవస్త్ర ధారిణియై పొయ్యి వెలిగిస్తుంది కోట్రత్తమ్మ. ఇడ్లీ తయారీ విషయంలో వాడే వస్తు సామాగ్రిలో కూడా శుభ్రతకు రాజీ లేదు.
నెల్లో మూడు రోజులు బయటనే ఉండి నడిపిస్తుంది కోట్రత్తమ్మ. ఆ రోజుల్లో మొత్తం వ్యాపార భారం మస్తానయ్య పిల్లలదే ఒక్క డబ్బులు వసూలు తప్ప, దూరంగా నేల మీద పెట్టించి తీసుకొనేది డబ్బులు.
వ్యాపారం మొదలు పెట్టిన కొత్తల్లో మస్తానయ్య ఒక రెండు వాయల ఇడ్లీలు పళ్ళెంలో వేసుకొని నాలుగు వీధులు తిరిగి అమ్ము కొచ్చేవాడు. తరవాత్తర్వాత పేరొచ్చి జనాల్ని ఇంటి దగ్గర కొచ్చి కొనేలా చేసింది వాటి రుచి.
ఆ పేటలో ప్రతి వాళ్ళూ కోట్రత్తమ్మ ఇడ్లీ తిన్న వాళ్ళే.
పప్పులు, చింతపండు ముక్కలు తగులుతూ రోట నూరిన ఆ కారప్పొడి రుచి చెప్ప భాష చాలదు.
తాలింపు లో పడ్డ పప్పు బద్దలు శనగపప్పు పచ్చడికి అదనపు రుచి.
ఏనాడూ వాటి రుచిలో తేడా రాకుండా చేయగలగడం ఆమె నైపుణ్యం; తిన్న మా అదృష్టం.
నాలుగు లంఖణాలు చేసి లేచిన వాళ్ళు మొదట ముట్టేది కోట్రత్తమ్మ ఇడ్లీనే - అదే పథ్యం.
మా రామచందర్రావు డాక్టరు గారి ప్రిస్కిప్షన్ లో చోటు చేసుకున్నదంటే కోట్రత్తమ్మ ఇడ్లీ ఘనత వేరుగా చెప్పే ప్రయత్నం అనవసరం -
“రెండు కోట్రత్తమ్మ ఇడ్లీ విత్ కారప్పొడి ఆర్ విత్ చింతకాయ పచ్చడి.”
*************
జీవనోపాధి కోసం మొదలు పెట్టినా
దాని కోసం తమ జీవితాన్నే వెచ్చించి
వేరే వాళ్ళ జీవిత పుస్తకంలో తమకంటూ రెండు పేజీలు పదిలం చేసుకున్న……
ఓ కోటిరత్నమ్మ,....
ఓ బాబాయ్…..
ఓ కోటయ్య….
ఓ రామయ్య…. ఎందరెందరో!
అందరూ ధన్య జీవులే!
చిరు స్మరణార్హులే!
&&&&&&&&&-----------&&&&&&&&&

Comments
Post a Comment