Skip to main content

మృత్యువు కు చెక్

MMTS కధలు


మృత్యువు కు చెక్ :


చందానగర్ స్టేషన్ లో నేను ఎక్కాల్సిన MMTS బండి వచ్చి ఆగింది. టైమ్ చూసుకుంటూ బోగీ దగ్గరకి నడిచాను. బండి పావుగంట ఆలస్యం. ఇంకెక్కడా ఆలస్యం అవకుండా బండి నడిస్తే ఆఫీసుకు అయిదు నిముషాలు ముందు చేరుకుంటాను. లేదంటే బాసు పెట్టే నోటి వాతలకి సిద్దంగా ఉండాలి.
అవును మరి, రచయిత జంధ్యాల గారికి కూడా తట్టని తిట్లు తిట్టగలడు మా బాసు. అంత కొత్తగా వేడిగా పడేవి మరి నోటి వాతలే కదా!  శరీరం మీది మామూలు వాతలైతే అంగీతోనో, పాంటు తోనో దాచుకోవచ్చు. కానీమా బాసు పెట్టే సెటైరిక్ శాడిస్టు నోటివాతలు, రెండు బదిలీల మీద రెండు ఆఫీసులు మారినా మర్చిపోలేం!

బోగిలోకి ఎక్కి చక్రవర్తి కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడా? అని. కన్పడలేదు. చక్రవర్తి MMTS బయల్దేరే స్టేషన్ లింగంపల్లిలో ఎక్కుతాడు. తనప్రక్క సీటు నా కోసం ఆపి ఉంచుతాడు. ఇద్దరం ఒకే ఆఫీసు అవడంతో మా MMTS పయనం రోజూ మూడు యధార్ధాలు, ఆరు పుకారుల కబుర్లతో నడిచి పోతోంది.
ఎప్పుడైనా ఎవ్వరం సెలవు పెడుతున్నా రెండో వాళ్ళకి చెప్పుకుంటాం.

“ ఈ రోజు ఏమైంది తనకి” అనుకుంటూ ఖాళీగా కనబడ్డ సీటులోకి శరీరాన్ని చేర్చాను.

“మీ బెటర్ హాఫ్ ఏడి సర్ , కనబడ్డం లేదు?” - రోజూ మా బోగీనే ఎక్కే మరో శాల్తీ పరాచకపు పలకరింపు.
నన్నూ, చక్రవర్తినీ ఒకరికొకరు బెటర్ హాఫ్ అంటూ తోటి శాశ్వత బోగీ వాసులు పరాచకాలాడు తుంటారు.
అదేం అవమానకరమైన సంబోధన కాదు గాబట్టి మేం ఎప్పుడూ బాధ పళ్ళేదు. మా బోగీకి మేమంతా ఓ పన్నెండు పదమూడు మందిమి శాశ్వత ప్రయాణీకులం. ప్రక్క ప్రక్క స్టేషన్లలో దిగుతూంటాం. ఇంజను నుంచి ఆరో బోగీ. రోజూ ఆఫీసుకు వెళ్ళేటప్పుడే కలవడం జరుగుతుంటూంది. వచ్చేటప్పుడు కలిసేది తక్కువ. అందరం అభిమన్యుడి బంధువులం - ఆఫీసు లోకి వెళ్ళే సమయం మాత్రమే తెల్సిన వాళ్ళం.
మా మాటల్లో కాదేదీ కబుర్ల కనర్హం! పేపర్లో పడేవాటి మీద వ్యాఖ్యానాలు, సెటైర్ లు, జోస్యాలు గట్రా. కొంతమంది తోటి ప్రయాణీకులు కళ్లు మూసుకుని వింటూ సహిస్తూంటారు, ఆనందిస్తూంటారు. మరికొంత మంది అసహనాన్ని రకరకాలుగా ప్రకటిస్తుంటారు.

“ అదే తెలియట్లేదు. కనుక్కోవాలి సర్ “ అంటూ సెల్ తీసి రింగ్ చేసాను చక్రధర్ కి.
వెంటనే తీశాడు “ ఏంటి బాస్ ?” అంటూ.
చక్రవర్తి తో మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. తను నాకు శుక్రవారమే చెప్పాడు - “ రేపు మా మొగుళ్ళొస్తున్నారు. నాలుగు రోజులుంటారు. వాళ్ళకి ఏ లోటూ రాకుండా చూసుకోవాలట, బాసు చెప్పేశాడు”.

చక్రవర్తి మా ఆఫీసు అకౌంట్స్ డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జి. సంవత్సరానికి ఒకసారి జరిగే స్టాట్చ్యుటరీ ఆడిట్ రోజుల్లో మాత్రం అసలు పలకరించలేనంత బిజీ! బయటి నుండి వచ్చే ఈ ఆడిటర్స్ ని ఎంత హేపీ చేస్తే అంత మంచిదని నానుడి. వాళ్ళకి కోపం వచ్చిందంటే, వాళ్ళని తట్టుకో గలిగినా బాసును మాత్రం తట్టుకోలేం.
వాళ్ళున్నన్నాళ్ళు చక్రవర్తి బీపీ షూట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి మర్యాదలు, మంచి భోజనాలు, కోరితే విహార యాత్రలూ అన్నీ సమకూర్చాలి.

నన్ను అడిగిన తోటి ప్రయాణీకుడికి చెప్పాను “ చక్రవర్తి ఆడిట్ వాళ్ళ చక్రబంధంలో ఉన్నాడు. ఇంక నాల్రోజులు మర్చిపోడమే!”.

******************

ఆఫీసుకు వెళ్ళాక చక్రవర్తి టేబుల్ దగ్గర చూస్తే లేడు. ఆడిట్ కోసం వేరే హాల్ ఒకటి ప్రత్యేకంగా కేటాయించారు, దాన్లో కనిపించాడు. దగ్గరకెళ్ళి “ ఎలా ఉంది ఆడిట్ పరిస్థితి” అంటూ పలకరించాను.
“ ఫర్లేదు, కాని ఒకట్రెండు విషయాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. టఫ్ గా ఉన్నాడు మెయిన్ ఆడిటర్ . ఇంకా మన బాసు దాకా వెళ్ళ లేదు. బాసుకు తెలిస్తే చచ్చామే!” చక్రవర్తి చెప్తున్నప్పుడు, ఇబ్బంది పెట్టే ఆ విషయం కంటే బాసుకు తెలిస్తే ఏం తిడతాడో అన్న భయం ఎక్కువ కన్పించింది తన ముఖంలో.

“ డోంట్ వర్రీ బాస్ ! అంతా మంచిగా అయిపోతుంది. సర్లే గానీ సాయంత్రం కల్సివెళ్దాం, ఎంత లేటయినా!” నాక్కూడా కొంచం పెండింగ్ పని ఉండడంతో లేటుగా కూర్చోని చేసుకోవచ్చనుకొని, అట్లా చెప్పి వచ్చేశాను నా సీటుకి.

మధ్య్హాన్నం లంచ్ లో జాయిన్ అయ్యాడు చక్రవర్తి. మామూలుగా ఆడిట్ అప్పుడు ఆడిటర్స్ తో బయటనే లంచ్ చేస్తాడు అందుకని ఇంటి దగ్గర నుండి తెచ్చుకోడు.

“ఏంటీ, వాళ్ళతో వెళ్ళలేదు?” అడిగాను.
“ కొంచెం బాగలేదు వంట్లో. ఏం తినబుద్ధి కావడంలేదు. బాస్ ని రిక్వెస్ట్ చేసాను వాళ్ళకు కంపెనీ ఇవ్వమని, ఆయన వెళ్ళాడు” చక్రవర్తి చెప్పాడు.
నేను తెచ్చినదే ఇద్దరం తిని, జ్యూస్ తెప్పించుకున్నాం. తను మాత్రం ఏదో అసౌకర్యంగా ఉన్నట్లు నాకు అన్పించింది.

*******************

మాకు పని ముగించుకొని ఆఫీసు వదిలి MMTS స్టేషన్ కి వచ్చేసరికి రాత్రి 9.15 గంటలైంది. ఇంక చివరి ట్రైన్ ఒకటి ఉంది, అదీ ఇంకా పదిహేను నిముషాల తర్వాతే. చక్రవర్తి బాగా అలిసి పోయి కన్పిస్తున్నాడు, ఏదీ మాట్లాడట్లేదు.
“ రేపటితో అయిపోతుందా ఆడిట్ ?” అడిగాను,
“ఫైనల్ చేస్తార్ట రేపు, కానీ సంతకాలు మాత్రం రెండ్రోజులు ఆగి మళ్ళీ వచ్చినప్పుడు చేస్తారట! అప్పటి దాకా  తప్పదీ టెన్షన్ “ చెప్పాడు.

ఇంతలో ఒక MMTS వచ్చింది, బహుశా 9  గంటల బండి కావచ్చు! లేటయి మా కోసమే వచ్చినట్లు అన్పించింది. ఎక్కువ రష్ లేకుండా ఉండి కూర్చోడానికి సీట్లు దొరికినయ్ .

కొద్దిసేపటికే “ చాలా గాభరాగా, అసౌకర్యంగా ఉందేంటో నాకు “ అన్నాడు చక్రవర్తి.

“డీప్ బ్రీతింగ్ తీసుకో కాసేపు “ సలహా ఇచ్చాను.

ఇంకో రెండు నిముషాలకే బోగీ ఎంట్రీ ఎదురుగా ఉన్న తలుపుల దగ్గరకెళ్ళి పెద్ద వాంతి చేసుకున్నాడు.
దగ్గరకెళ్ళి అడిగాను “ ఏంటి! ఏమైంది”.
“సన్నగా నొప్పి వస్తోంది” ఛాతి దగ్గర చేయి పెట్టి  చెబుతూ అక్కడే క్రింద కూర్చుండి పోయాడు.

“స్ట్రోక్ వస్తోందేమో!” నా మనసెందుకో కీడు శంకించింది.  ఆ ఆలోచనతో భయం వేసింది.
“ఏం చేయ్యాలిప్పుడు” అనుకుంటూనే, అక్కడ నిలబడిన వాళ్ళని బ్రతిమలాడి ప్రక్కకి జరిగించి చక్రవర్తిని పడుకో బెట్టాను.
“ఏమైంది! ఏమైంది!” పదిమంది ప్రశ్నల వర్షం.
సమాధానమిచ్చేంత ఆలోచన లేదు. గాలి బాగా తగలడం కోసం అడ్డంగా ఎవరూ నిలబడి ఉండకుండా చూసుకున్నాను.
చమట పట్టేసి చొక్కా బాగా తడిసి పోయింది చక్రవర్తికి.
ఆ మధ్య నేను చదివిన వాట్సాప్ పోష్టు ఒకటి స్ఫురించింది.
వెంటనే చక్రవర్తి తో “ ఏం భయపడకు చక్రవర్తీ. ఏమీ కాదు. కానీ నువ్వు ఒక పని చేయాలి - చిన్నగా దగ్గడం మొదలు పెట్టు. ఆపకు దగ్గుతూనే ఉండు” చెప్పి బలవంతంగా దగ్గడం చేయించాను.
బండి బేగంపేట స్టేషను దాటివేళ్తోంది.  లింగంపల్లికి ఇంకో ఇరవై అయిదు నిముషాలన్నా పడ్తుంది. అంతసేపు వేచిచూడ్డం మంచిది కాదన్పించింది.
వెంటనే సెల్ నుండి 108 సర్వీసుకు చేసి Hi-Tec City MMTS స్టేషన్ దగ్గరకి అంబులెన్స్ పంపమని కోరాను. వాళ్ళు కన్ఫర్ మేషన్ కోసం మళ్ళీ నాకు కాల్ చేసారు. వీలయినంత త్వరగా కావాలని, బేగంపేట వైపు నుండి వస్తున్నామని, అటు గేటు వైపుకు తెమ్మని, స్ట్రెచర్ ప్లాట్ ఫారం మీదకి తెచ్చేయమని ఒకదాని తర్వాత ఒకటి వేగంగా వివరంగా చెప్పేశాను.

మరో పది నిముషాలు నేనూ, మరొకతను చక్రవర్తికి అరి చేతులు, అరికాళ్ళూ రుద్దుతున్నాం. చక్రవర్తి దగ్గడం ఆపేశాడు, మనం చెప్పేదేదీ అతనికీ తెలియడం లేదు.

కొద్ది సేపటికి Hi-tec City స్టేషన్ కొచ్చింది బండి. నాకు సహకరిస్తున్న అతనికి కృతజ్ఞతలు చెప్పి, మరొక్క సాయంగా, బండి ఆగగానే ఇంజిన్ డ్రైవర్ ని కలిసి, పరిస్థితి చెప్పి, బండిని కొద్దిసేపు ఆపేలా చూడమని చెప్పాను.

బండి ఆగుతూనే అంబులెన్సు వాళ్ళని పిలిచి చక్రవర్తిని ఎక్కించి, నేను కూడా ఎక్కి, దగ్గర్లో ఉన్న మంచి హాస్పిటల్ కి తీసుకెళ్ళమన్నాను.
చక్రవర్తి నోరు తెరిచి నాలుక కింద ఒక టాబ్లేట్ పెట్టింది సిస్టర్ .
****************
ఎమర్జెన్సీ వార్డ్ బయట నేనూ, లోపల చక్రవర్తి. ఇంతలోనే ఎంత తేడా! అరగంట క్రితం ఇద్దరం ఒకరి ప్రక్కన ఒకరం….. ఇప్పుడు రేపు కలిసి ప్రయాణిస్తామో లేదో అనే పరిస్థితి!

నా ఆలోచనలకు అడ్డు తగులుతూ సిస్టర్ బయటకొచ్చి “ ఈ మందులు తీసుకు రండి” అంటూ ఓ ప్రిస్కిప్షన్ చేతిలో పెట్టింది. లేచి బయల్దేరుతున్న నాతో ఆమే “ సరైన సమయానికి ఫస్ట్ ఎయిడ్ అందింది, టైమ్ కి తేగల్గారు. ప్రమాదం తప్పినట్లే” అంది.

మందులు తెచ్చి ఇచ్చే సరికి చక్రవర్తి కొడుకు, భార్య హాస్పిటల్ దగ్గర కొచ్చారు. వాళ్ళకేం కంగారు పడక్కర్లేదని చెప్పాను. వాళ్ళు “మేం ఉన్నాం కదండీ, ఫర్లేదు మీరు ఇంటికి వెళ్ళండి” అని బలవంతం చేయడంతో, మరో పావుగంట ఉండి, నా బండి తీసుకోడానికి చందానగర్ స్టేషన్ కి టాక్సీ మాట్లాడుకొని బయల్దేరాను.

“సరైన సమయానికి ఫస్ట్ ఎయిడ్ అందింది” సిస్టర్ మాటలు గుర్తొచ్చాయి. వాట్సప్ లో వచ్చిన ఆ సమాచారం ఎంత సహాయం చేసింది!

పనికిమాలిన ఒకే పోస్టు పది మంది నుండి కూడా రావడం చూసాను, ఉపయోగపడే అలాంటి సమాచారం ఒక్కసారే వచ్చింది. ఎవరు పంపించారో పుణ్యాత్ముడు, దానివల్ల చక్రవర్తి ని నిలుపుకో గలిగాను. ఆ పోస్టు పంపిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పాలన్పించింది. కానీ ఎలా వెతకను? ఎవరు పంపారో తెలియాలంటే కాంటాక్ట్ లో ఉన్న అందరి పోస్ట్ లూ వెతకడం కష్టం.

నాకొక అలవాటు ఉంది. బాగా నచ్చిన లేదా మంచి సమాచారం ఉన్న పోస్ట్ లకు స్టార్ స్టేటస్  ఇస్తాను. దానివల్ల ఎప్పుడైనా ఆ పోస్ట్ చూసుకోవచ్చు.

మా చక్రవర్తిని బ్రతికేలా చేసిన ఆ సమాచారం పంపిన మహానుభావుడెవరో తెలిస్తే బాగుణ్ణు. వెళ్ళి స్వీట్స్ పంచి వస్తాను. నా స్టార్డ్ (Starred) మెసేజ్ లు వెతకడం మొదలు పెట్టాను.

కాసేపటికి దొరికింది.

గబగబా క్రిందికి జరుపుతూ పంపిన వాళ్ళ పేరు చూశాను.

ఆశ్చర్యం…..

ఎంతగా సరిపడింది…..

అలౌకిక అనుభూతి…..

ఆ సమాచారం పంపింది -

చక్రవర్తి.

॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥

( రా. శా. )

Comments

Popular posts from this blog

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష! పదేళ్ళ క్రితం: "ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ . "మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి. ****** తొమ్మిదేళ్ళ క్రితం: " ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో. " అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి. ****** ఎనిమిదేళ్ళ క్రితం: "ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున. " అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు. ****** ఏడేళ్...
కిర్  కిర్   తలపులు నియమం: వ్రతాలు, రోజాలు, సువార్త కూటములు - ఆన్నింటిలో వ్యాపకం ఒకటే భజించడం .... దాగిఉందొక మూల వ్యాపకం తదుపరి భుజించడం