MMTS కధలు - విడుదల: ఆరోజు నాకు చందానగర్ MMTS స్టేషన్ చేరడంలో ఆలస్యం అయింది. నా కళ్ళ ముందే నేను ఎక్కవలసిన MMTS ప్లాట్ ఫాం మీదికి వస్తోంది. బండి పార్కింగ్ లో పెట్టే సమయం కూడా లేదు. ప్రక్క స్టాండ్ మీద నుంచో పెట్టి, తాళం వేయకుండా తాళంచెవి చేత పట్టుకొని, బండిని స్టాండ్ లో పెట్టేయడానికి పార్కింగ్ నడిపే కుర్రాడికి “ పార్కింగ్ లో పెట్టేసేయ్ , బండి వచ్చేసింది” అని చెప్పుకుంటూ ప్లాట్ ఫారం మీదికి పరుగు లంఘించాను. ఆలస్యం అయినప్పుడు అలా తాళం వేయకుండా చెప్పేసి వెళ్ళడం ఒక రివాజు, పార్కింగ్ పాస్ ఉన్న వాళ్ళకుండే ప్రివిలేజ్ . తాళం "మా దగ్గర ఉంచద్దు” అనడం పార్కింగ్ నడిపే వారి నిజాయితీ, నిబద్ధతకి నిదర్శనం. నేను ఎప్పుడూ ఎక్కే, బోగీ చాలా ముందుకు ఉండడంతో నా పరుగులాంటి నడకను తగ్గించుకొని దగ్గరలో ఉన్న బోగీలో ఎక్కేసి ఖాళీ ఉన్న సీటులో కూర్చుండి పోయాను. బండి బయలు దేరడానికి కూత వేసింది. నా బ్రీఫ్ కేసులో ఉండే దినపత్రిక నా చేతికి చేరింది. కొద్ది సేపటికి బండి హఫీజుపేట స్టేషన్ చేరింది.స్టేషన్ గేటు లో నుండి తల్లీ కూతుళ్ళ వయసులో ఉండే ఇద్దరు ఆడవాళ్ళూ, వెనకాలే ఒక మగ వ్యక్తి బండి వైపు పరిగెట్టు కుంటూ వచ్చారు. ...