Skip to main content

ALUMNI ( పూర్వ విద్యార్ధి )

ALUMNI (పూర్వ విద్యార్ధి)


అన్నయ్య కూతురు సుమేధ పెళ్ళికని అమెరికాలో స్థిరపడిన రమణ భార్య, పిల్లల్తో సొంత ఊరుకొచ్చాడు. నాలుగేళ్ళ తర్వాత  ఇప్పుడే మళ్ళీ ఇండియాకి రావడం. అయినవాళ్ళు అందరినీ కలవడం కోసం కొంచెం ఎక్కువ రోజులు సెలవు తీసుకొని వచ్చాడు, దానికి తోడు పిల్లలకి కూడా సెలవులే. అన్నీ కలిసి వచ్చాయ్ .


ఆ ఊర్లో రమణ వాళ్ళ కుటుంబం తెలియని

వాళ్ళుండరు. రమణ వాళ్ళ నాన్న సీతాపతిరావు ఊరంతటికీ బంధువు. అందరి కష్టం ఆయన కష్టం. ఆ ఊరు ప్రగతికి ముఖ్యకారకుడు సీతాపతిరావే. మరి అంతటి ఆయన మనుమరాలు పెళ్ళంటే ఇంక చెప్పాలా!

పెళ్ళి ఊరంతా పండగలా జరుపుకున్నారు.

రమణ భార్య మూణ్ణిద్దర్లకని పెళ్ళికూతురుతో పెళ్ళికొడుకు వాళ్ళింటికి వెళ్ళింది.


పెళ్ళి హడావిడి తగ్గి కొంత తీరిక దొరకడంతో అదేఊర్లో మెడికల్ షాపు నడుపుతున్న తన  చిన్నప్పటి స్నేహితుడు  పార్ధసారధి దగ్గరకొచ్చాడు రమణ.


“రారా, రమణా. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయినట్టున్నారు.  హడావుడి తగ్గినట్టేనా?” పార్ధూ పరామర్శ.


“ఇవాళేరా కొంచెం తీరిక దొరికింది. ఉద్యోగాల వాళ్ళందరూ వెళ్ళి పోయారు. పెద్దవాళ్ళని పోనివ్వట్లేదు నాన్న. ఆయన సంగతి నీకు తెలుసుగా!” కుర్చీలో కూర్చుంటూ అన్నాడు రమణ.

“నా నలభైయేళ్ళ జీవితంలో ఇంత సందడిగా జరిగిన పెళ్ళి మరోటి చూళ్ళేదురా రమణా. జీవితాంతం కళ్ళల్లో ఉండి పోతుంది. ఇది నా ఒక్కడి మాట కాదు. ఊర్లో అందరూ ఇదే మాట”


“ఏమో రా పార్ధూ, మీరందరే నాన్న బలం.మీరందరూ కలవకపోతే ఇంత సులువుగా అవుతుందా అయిదు రోజుల పెళ్ళి.” కృతఙ్నతగా అన్నాడు రమణ.


“ ఇంకా ఏంట్రా అమెరికా సంగతులు?” అడిగాడు పార్ధు.


“ఈ పిలుపే కరువైందిరా. ఇలా అరే… ఒరేయ్ అనే మనిషే ఉండడు. అందరూ మంచివాళ్ళే. కాని మనసును తాకేలా పలకరింపులుండవ్ . పార్ధూ నా దృష్ఠిలో అసలైన  పేదవాడెవడంటే జీవితాంతం చనువుగా అరే, ఒరే అని పిలిచే  ఒక్క స్నేహితుడైనా లేనివాడు”.


వినడం పార్ధూ వంతు అయింది.


“అక్కడి జాలర్లు వేసిన డాలర్ల వలలోపడి కొట్టుకు  పోతున్నామేమో అన్పిస్తుంటుందిరా. చాల సుఖంగా ఉంటుందిరా అక్కడ, కాని చాలా ఆనందంగా మాత్రం ఉండదురా.”


“ఏంట్రా అంత emotional అయిపోతున్నావ్ . Green Card holderవి. పిల్లలిద్దరూ అక్కడే పుట్టారు. ఇంక అదే నీదేశం చేసుకున్నావ్ అనుకుంటున్నాన్రా నేను.”


“లేదురా పార్ఢూ! ఎన్ని సంవత్సరాలు మనం అక్కడ ఉన్నా మనం పరాయి వాళ్ళమే అనేది అర్ధమైంది. నేను సమూలంగా వెళ్ళలేదురా.నా వ్రేళ్ళు ఇక్కడే ఉన్నాయిరా. అంటు మాత్రమే అక్కడ పెరుగుతోంది.” ఈ మాటలు అంటున్నప్పుడు రమణ గొంతు గద్గదమైంది.


“అందులో తప్పేముందిరా? అక్కడ మంచి అవకాశాలున్నాయన్పించింది, వెళ్ళావు.” అనునూయంగా మాట్లాడాడు పార్ధు.


“వస్తాన్రా! పిల్లలు కొంచెం పెద్దయ్యి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలవగానే వచ్చేస్తాను. నా నేలకి ఋణపడి ఉన్నాను. తీర్చుకోవాలి.”

రమణ emotional flow కి అడ్డురాకుండా వింటున్నాడు పార్ధు.


“చాలినంత సంపాయించానురా. అంతా తెచ్చేస్తానురా. మన ఊరికోసం ఎంత చేసినా తక్కువే. మంచి సంస్కారం, సభ్యతలని నేర్పిన ఈ నేల ఋణం తీర్చుకోలేనిది”. చెప్పుకెళ్తున్న రమణ వైపే ఆశ్చర్యంగా చూస్తున్నాడు పార్ధు. రమణ మనసులో తన ఉరి మీద ఇంత ప్రేమాభిమానాలున్నాయనుకోలేదు అతను.

Trump వచ్చినప్పట్నుండి కొంచెం ఇబ్బంది కరంగానే ఉన్నట్లుంది కదా మన వాళ్ళకు” వాతావరణంలో గంభీరత తగ్గించేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు పార్ధు.

“మీడియాలో వస్తున్నంత దారుణంగా అయితే లేదు. కాని ఈసు - నసూయలు మానవ సహజం కదరా! ఎవడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్పలేం కదా! తమ లబ్ధి కోసం అవతల వాళ్ళని ఎగేయడం ప్రపంచంలో అన్నిచోట్లా జరుగుతూనే ఉంటుందని చరిత్ర చెబుతూనే ఉందిగా. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది, ఎందుకంటే వాళ్ళగూట్లో మనం చేరాం కాని, మన గూడులోకి వాళ్ళు రాలేదుగా” వేదాంత ధోరణిలో మాట్లాడాడు రమణ.


ఇంతలో ఎవరిదో ఫోను పార్ధుకి.


మాట్లాడ్డం అవగానే అడిగాడు రమణ, “latest position ఏంట్రా, ఎక్కడి దాకా వచ్చింది మన

ఫ్రెండ్స్ లిస్ట్ , అడ్రస్  లు సంపాదించడం?.”

మళ్ళి తనే అన్నాడు “పెళ్ళి పనుల్లో పడి కొంత నెమ్మదించింది మన కార్యక్రమం. ఇంకా 15రోజులే ఉంది. ఇవాళ రాత్రికి మాఇంట్లో డాబా గదిలో కూర్చుని ప్రోగ్రాం అంతా  పక్కాగా నిర్ణయించేద్దాం. నువ్వు మూర్తిని, భుజంగంగాడ్ని తీసుకొని వచ్చేయ్ నేను ఎదురు చూస్తూంటా”, అంటూ లేచాడు రమణ.

భుజంగం గాడిని అని పలకడంలో రమణ గొంతులో అహం లేదు కొండంత చనువే తప్ప.


15 రోజుల్లో వాళ్ళు జరుపుకోవాలనుకుంటున్న పండగ - వాళ్ళ కళాశాల రజితోత్సవం. అదే రోజు రమణ వాళ్ళ డిగ్రీ బాచ్ అందరి పునః కలయిక.


ఆ కాలేజీ గురించి చెప్పుకోవాలంటే: —

రమణ వాళ్ళ నాన్న సీతాపతిరావు Defence లో చేసి రిటైర్ అయ్యాడు. ఉన్నత  భావాలు కలిగిన వ్యక్తి. మాతృభూమి ఋణం తీర్చుకోడం ఒక్క సైన్యంలో చేరడం ద్వారానే వీలవుతుందని నమ్మినవాడు. పునరావాసం కోసం ఇచ్చిన భూమి పక్కనే రిటైర్మెంట్ తో వచ్చిన డబ్బుతో ఇంకొంత భూమి కొని వ్యవసాయం మొదలు పెట్టాడు.


ఆ గ్రామంలో పిల్లలు చదువుకోడానికి నాలుగుమైళ్ళ దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల కెళ్ళాల్సి వచ్చేది. పిల్లలకి ఉచిత విద్య ఇవ్వాలని తనే ఒక చిన్న బడి స్థాపించాడు. ఒక  ప్రక్క వ్యవసాయం మరోప్రక్క విద్యాసాయం.


సీతాపతిరావు ఆదర్శాలకు ప్రభావితులై ఊరు పెద్దలు పాఠశాల కోసం భూదానం చేసి చందాలు వసూలు చేసి డబ్బు కూడా కూర్చారు.

ఊరి పెద్దలందర్ని ఒక తాటి మీదకి తెచ్చి కమిటీ స్కూలు ఏర్పరచాడు. సామాన్యంగా గుళ్ళకి మాన్యం భూములుంటయ్ . కాని ఈ కళాశాలకి మాన్యం భూములేర్పడినయ్ అంటేనే తెలుస్తుంది అదంటే ఎంత ఆదరాభిమానాలో ఆ ఊరి వాళ్ళకి. దాని పేరు నిర్ణయించే భాద్యత కూడా ఆయన మీదే పెట్టారు ఊరి పెద్దలు.

సీతాపతిరావు చాలా ఆలోచించి ఆలోచించి తనకిష్టమైన కవి శ్రీనాధుడు పేరు పెట్టాడు -

కవి సార్వభౌమ శ్రీనాధ విద్యాలయ.


ఆ  విద్యాలయం ఏర్పడిన తర్వాత ఆ ఊర్లో పుట్టిన ఏ బిడ్డా నిరక్షరాశ్యుడు కాలేదు.


పాతకాలం పిల్లలందరూ శ్రీనాధ విద్యాలయ అని పిలుచుకునే వాళ్ళు.

ఇప్పటి పిల్లలు దాన్ని శ్రీనాధ్ కాలేజి గా మార్చేసారు పిలుపులో.


మొదట హైస్కూలుగా పుట్టి, కొద్ది కాలానికి జూనియర్ కాలేజిగా పెరిగి, మరి రెండేళ్ళకి డిగ్రీ కళాశాల స్థాయి తెచ్చుకుంది శ్రీనాధ విద్యాలయ.రమణ వాళ్ళు ఆ కళాశాల నుంచి వచ్చిన మొదటి డిగ్రీ బాచ్ .


అందుకే కాలేజి రజితోత్సవం సందర్భంలోనే తమ డిగ్రి బాచ్ వాళ్ళందర్నీ ఒక వేదిక మీద కలపాలనకున్నాడు రమణ.


అనుకున్నప్పటి నుండీ, ఊళ్ళోనే ఉండే పార్ధు, మూర్తి, భుజంగం సాయం తో తమ బాచ్ వాళ్ళ అందరి విషయాలు సేకరించడం, వాళ్ళతో మాట్లాడ్డం చేసి “పూర్వ విద్యార్ధుల సమావేశం”కు హాజరు అయ్యేలా ఒప్పించడం జరిగి పోతున్నాయి.


రాత్రి 8 గంటలకల్లా సీతాపతిరావు ఇంటి డాబా మీద సమావేశమయ్యారు -- సీతాపతిరావు, కళాశాల కమిటీ సభ్యుల్లో ముఖ్యులు, రమణ అన్నయ్య, రమణ - అతని భార్య, పార్ధసారధి, మూర్తి, భుజంగరావు.


ఒక గంటసేపు చర్చించుకొని కార్యక్రమం నిర్ణయించారు.


చివర్లో రమణ ఫ్రెండ్స్ తో అన్నాడు,  “నాకు  US నుండి call వచ్చిందిరా. మూడు, నాల్గు రోజుల కోసం వెళ్ళాలి తప్పనిసరిగా.”

“అదేంట్రా!” రమణ మాటలకి అడ్డొచ్చాడు మూర్తి.

“మన ప్రోగ్రామ్ రోజుకు రెండు రోజుల ముందు కల్లా వచ్చేస్తా. నేనక్కడి నుండి రోజూ మీతో కాంటాక్ట్ లో ఉంటా. నేను లేకపోయినా పనులు ఆగ కూడదురోయ్ . మా అన్నయ్య, నాన్నా, నా  వైఫ్ అందరూ కూడా ఇదే పనిలో ఉంటారు.” రమణ చెప్పాడు.

“నువ్వుంటే ధైర్యంగా ఉంటుందిరా. నీ వెనక ఎంత పనైనా చేస్తాం” తగ్గిన ఉత్సాహంతో అన్నాడు భుజంగం.

“నేను ఆఫీసులో లేనప్పుడు పూర్తిగా ఇదే పని మీద మీతో ఉంటాన్రా.  కాకపోతే భౌతికంగా మీదగ్గర ఉండట్లేదంతే!” ముక్తాయించాడు రమణ.

॰॰॰॰॰॰॰॰॰॰॰

ఆ మర్నాటి నుండి రమణ పనులన్నీ తనుగా

చేస్తూ, కొన్ని పురమాయిస్తూ, ఎవరెవరు ఏది follow-up చేయాలో అన్నీ ఒక file చేసి వెళ్ళేముందు వాళ్ళ నాన్నకి, అన్నయ్యకి , పార్ధుకి అప్పచెప్పాడు. వేడుకలు ఇంకో వారం రోజుల్లో అనగా  అమెరికా వెళ్ళాడు ఆఫీసు పని పూర్తి చేయడానికి.

*************

నాలుగు రోజులు ఇట్టే గడిచి పోయినయ్ . అయిదో రోజు రమణ పోన్ చేసి “నేను ఇంకో గంటలో బయల్దేరుతున్నాన్రా ఇండియాకి. Flight delay లేకపోతే రేపు సాయంత్రంకల్లా అక్కడుంటా. ఫ్లయిట్ లో cell పనిచేయదు కాబట్టి మాట్లాడ్డం కుదర్దు” అన్నాడు పార్ధూతో.

“రా..రా.. నీకోసమే చూస్తున్నాం”  పార్ధు చెప్పాడు ఉత్సాహంగా.


ఇంకో రోజు కూడా గడిచి పోయింది.

రమణ వాళ్ళ ఊరు పండగ వాతావరణం నింపుకుంది. వచ్చిన వాళ్ళకి అందరికీ కళాశాలలోనే అన్ని ఏర్పాట్లూ, ఆడిటోరియంలో సభలు, సమావేశాలు.

పాత విద్యార్ధులు, పాత ఉపాధ్యాయుల కలయిక, పలకరింపులతో ఆ స్థలమంతా కోలాహలంగా ఉంది.

మూర్తి పార్ధూని కల్సినప్పుడల్లా అంటున్నాడు, “వీడు రమణ ఏంట్రా ఇంకా రాలేదు” అని.

“అదేరా చూస్తున్నా! కలిసిన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. మధ్యాహ్నం నుండి రమణ వాళ్ళ అన్నయ్య కూడా లేడు. హైదరాబాదు వెళ్ళాడట ఇప్పుడు చాలా అవసరంగా. “ చెప్పాడు పార్ధూ.


మర్నాడు కళాశాల రజితోత్సవం మొదలైంది ఉదయం పది గంటలకల్లా. వక్తల ప్రసంగాలు; విద్యాలయ మొదటి ప్రధానోపాధ్యాయుడు పరంధామయ్యగారికి సత్కారం-గండపెండేర బహుకరణ;

మొదటి మహిళా ఉపాధ్యాయురాలికి సత్కారం;

కళాశాలలో పనిచేసిన అధ్యాపకులకు, ఉద్యోగులకు బంగారు పతక జ్నాపికలు;

ప్రతి సంవత్సరం అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్ధులకు బహుమతులు: కనిష్టంగా రాష్టృస్థాయి క్రీడాకారులుగా ఎదిగిన ప్రస్థుత - పూర్వ విద్యార్ధులకు బహుమతులు; ప్రస్థుత విద్యార్ధినీ, విద్యార్ధుల సాంస్కృతికకార్యక్రమాలు--

ఒకదాని తర్వాత ఒకటి సజావుగా జరిగి పోతున్నాయి.

ఇవన్నీ రమణ, వాళ్ళనాన్న ప్లాన్ చేసినవే. రమణ మాత్రం ఇంకా రాలేదు.  సీతాపతిరావుగారు మాత్రం అన్నీ పద్దతిగా జరిగేలా చూసు కుంటున్నాడు. ఆయనకి చేయబోయిన సన్మానాన్ని సున్నితంగా తిరస్కరించాడు.

తర్వాత మధ్యాహ్నం విందు, కొద్దిసేపు విరామం తర్వాత -- రమణ వాళ్ళ డిగ్రీ మొదటి బాచ్ పూర్వ విద్యార్ధుల కలయిక సంబరం.

అందరూ రమణ  గురించే అడుగుతున్నారు ఏడి, ఎక్కడని.

“వస్తున్నాట్ట. మధ్యలో ఉన్నాడు. మనల్ని సమావేశంమొదలు పెట్ట మంటున్నారు  వాళ్ళ నాన్న” అన్నాడు పార్ధు.

అయిష్టంగానే మొదలు పెట్టారు రమణ స్నేహితులు.

చివరి వక్తగా రమణ పేరు రాసారు.


మిత్రులందరూ శ్రీనాధ కళాశాలతో వాళ్ళ అనుబంధం, తీపి - చేదు అనుభవాలు, చిలిపి చేష్టలు, వేరే వాళ్ళకు పెట్టిన వికృత. వేళాకోళ మారుపేర్లు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు.


ఇంతలో అంబులేన్సు బండి వచ్చి ఆగింది.

సమావేశంలో నిశ్శబ్దం ఆవరించింది.

అందులోంచి రమణ అన్నయ్య, భార్య దిగారు.

వెనకనే స్ర్టెచర్  దింపారు.

దాని మీద అచేతనంగా రమణ.

“రమణ… రమణ…” ఎవరో అరుస్తున్నారు.

అందరూ అటువైపు పరిగెత్తారు.

“ఏమైంది .. ఏమైంది .. రమణకి?” అడుగుతున్నారు కొందరు.

వాళ్ళ అన్నయ్య ద్వారా తెలిసింది  ----


ఇండియా రావడానికి ఎయిర్ పోర్ట్ కి బయల్దేరిన రమణ మధ్యలో కారు పెట్రోల్ స్టేషన్ దగ్గర ఆపాడు. వెనకనే మరో కారులో వచ్చిన ముగ్గురు అమెరికన్లు రమణ కారును గుద్ది ఇండియన్స్ ని తిడుతూ రమణ దగ్గర ఉన్న డబ్బు  cards లాగేసుకున్నారు.

టిక్కెట్ లాగేసుకోబోతుంటే అడ్డుపడిన రమణని కొట్టి వెళ్తూ వెళ్తూ వాళ్ళల్లో ఒకడు జరిపిన కాల్పుల్లో రమణ అక్కడే కుప్పకూలి పోయాడు.


పార్ధు కళ్ళలో నీళ్ళ సుడులు. “..... భౌతికంగా మీ దగ్గర ఉండట్లేదంతే” ఊరెళ్ళేముందు చివరగా రమణ అన్న మాటలు గుర్తు కోచ్చినయ్ .

“మాట తప్పావురా! రమణా…. ఇప్పుడు భౌతికంగా మాత్రమే ఉన్నావురా మా మధ్య” పార్ధూ మౌన రోదనలో కొట్టుకొచ్చిన మాటలు.

రమణ దేహాన్ని పూర్వ విద్యార్ధుల వేదిక మీద అందరి మధ్యలో ఉంచారు.


అదొక అ-పూర్వ విద్యార్ధుల కలయిక.



                    &&&&&&&&&&


Comments

Popular posts from this blog

మృత్యువు కు చెక్

MMTS కధలు మృత్యువు కు చెక్ : చందానగర్ స్టేషన్ లో నేను ఎక్కాల్సిన MMTS బండి వచ్చి ఆగింది. టైమ్ చూసుకుంటూ బోగీ దగ్గరకి నడిచాను. బండి పావుగంట ఆలస్యం. ఇంకెక్కడా ఆలస్యం అవకుండా బండి నడిస్తే ఆఫీసుకు అయిదు నిముషాలు ముందు చేరుకుంటాను. లేదంటే బాసు పెట్టే నోటి వాతలకి సిద్దంగా ఉండాలి. అవును మరి, రచయిత జంధ్యాల గారికి కూడా తట్టని తిట్లు తిట్టగలడు మా బాసు. అంత కొత్తగా వేడిగా పడేవి మరి నోటి వాతలే కదా!  శరీరం మీది మామూలు వాతలైతే అంగీతోనో, పాంటు తోనో దాచుకోవచ్చు. కానీమా బాసు పెట్టే సెటైరిక్ శాడిస్టు నోటివాతలు, రెండు బదిలీల మీద రెండు ఆఫీసులు మారినా మర్చిపోలేం! బోగిలోకి ఎక్కి చక్రవర్తి కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడా? అని. కన్పడలేదు. చక్రవర్తి MMTS బయల్దేరే స్టేషన్ లింగంపల్లిలో ఎక్కుతాడు. తనప్రక్క సీటు నా కోసం ఆపి ఉంచుతాడు. ఇద్దరం ఒకే ఆఫీసు అవడంతో మా MMTS పయనం రోజూ మూడు యధార్ధాలు, ఆరు పుకారుల కబుర్లతో నడిచి పోతోంది. ఎప్పుడైనా ఎవ్వరం సెలవు పెడుతున్నా రెండో వాళ్ళకి చెప్పుకుంటాం. “ ఈ రోజు ఏమైంది తనకి” అనుకుంటూ ఖాళీగా కనబడ్డ సీటులోకి శరీరాన్ని చేర్చాను. “మీ బెటర్ హాఫ్ ఏడి సర్ , కనబడ్డం లేదు?” -...

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష! పదేళ్ళ క్రితం: "ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ . "మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి. ****** తొమ్మిదేళ్ళ క్రితం: " ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో. " అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి. ****** ఎనిమిదేళ్ళ క్రితం: "ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున. " అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు. ****** ఏడేళ్...
కిర్  కిర్   తలపులు నియమం: వ్రతాలు, రోజాలు, సువార్త కూటములు - ఆన్నింటిలో వ్యాపకం ఒకటే భజించడం .... దాగిఉందొక మూల వ్యాపకం తదుపరి భుజించడం