Skip to main content

సత్తి - సావిత్రి - వినాయకుడు

సత్తి --  సావిత్రి --  వినాయకుడు



గజాసురుని ఉదరం నుండి విడుదల దొరికిన శంకరునికి కైలాస నివాసం లోకి ప్రవేశానికి అడ్డుపడ్డ బాలుని తల శూలంతో తెగ నరికి, తిరిగి పార్వతని చింతా విముక్తురాలుని చేయడానికి, గజాసురుని తలను అమర్చిన సంగతి ఆనోటా ఈ నోటా విన్న నారదునికి ఆ బాలుణ్ణి చూడాలనిపించింది.

అనిపించిందే తడవుగా కైలాసానికి బయలుదేరాడు.

నంది ద్వారా నారదుని రాక కారణం తెల్సుకొని సంతోషించి శంకరుడు అనుమతించాడు. కైలాస ద్వారం తెరుచుకోగా “హర హర మహాదేవ శంభో శంకర” అని నుతిస్తూ పార్వతీ సమేతుడైవున్న శంకరుని సమీపించి నమస్కరించి “ఆది దంపతులకు ప్రణామములు” అన్నాడు నారదుడు.

నారదుని ఆశీర్వదించి ఆసనం చూపించాడు శంకరుడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత నారదుడు తన రాక కారణం పార్వతీ దేవికి తెల్పి “వినాయకుని మాటలు, ఆటలు ఆ నోటా ఈ నోటా విని మనసాగ లేదు. చూడ వచ్చేశాను” అన్నాడు.
పార్వతి ఎంతో సంతోషించి “వినాయకా, ఇటు రామ్మా ఒకసారి… నీ కోసం ఎవరొచ్చారో చూడు” అని వినాయకుడిని పిలిచింది.

చంద్రుడితో ఆడుకుంటున్న వినాయకుడు నెలవంకగా ఉన్న చంద్రుణ్ణి చేతపుచ్చుకొని నారదుణ్ణి తదేకంగా చూస్తూ శివ పార్వతుల దగ్గరకొచ్చాడు.
శివుని తొడ మీద ఒక చెయ్యి వేసి, తల్లి సాయంతో మెల్లగా పైకి ఎక్కి తల్లి ఒడిలో కూర్చున్నాడు.
“ ఆయనే నారద మహర్షి, నిన్ను చూడటానికి వచ్చారు” పరిచయం చేసింది పార్వతి.
లేచి చేతిలో ఉన్న నెలవంకని తండ్రి శిగలో తురిమి  నారదుని చూచి చేతులు జోడించి “నమస్సులు. నారదుల వారికి” అంటూ వినమ్రంగా నమస్కరించాడు గజాననుడు.
“ సుఖీ భవ.. సుఖీ భవ “  ఆశీర్వదించాడు నారద మహర్షి.
“ ఈయన ఏంచేస్తుంటారు?” తల అమ్మవైపు తిప్పిమెల్లగా అడిగాడు వినాయకుడు.
“ఆయన త్రిలోక సంచారి” చెప్పింది పార్వతి.
“ఆయన ఇల్లెక్కడ” తిరిగి అడిగాడు వినాయకుడు తల్లిని.
అది చూసి “ ఏమో సందేహ నివృత్తి చేసుకుంటున్నట్లుంది కుమారుడు” అని పార్వతితో అన్నాడు నారదుడు.
“చిన్నతనం కదా… అన్నీ సందేహాలే” నవ్వుతూ చెప్పింది పార్వతి.
“నారాయణ… నారాయణ…” నవ్వుతూ అన్నాడు నారదుడు.
“నారాయణ..  ఏంటి తండ్రి గారూ” అడిగాడు శివుణ్ణి వినాయకుడు.
“అది ఆయన తాతగారి పేరు. అది ఉఛ్ఛరించక ఆయన ఘడియైన ఉండలేరు” శివుని సమాధానం.
“ఎందుకు? మర్చి పోతానేమోనని భయమా?”
“నువ్వే అడుగు కుమారా నారదుణ్ణి” శివుడు నవ్వుతూ అన్నాడు.
“నాయనా… వినాయకా ఇలారా ఒకసారి” ఆప్యాయంగా పిలిచాడు నారదుడు.
పార్వతి ఒడి నుండి జారుతూ క్రిందికి దిగి నారదుని వైపు నడవసాగాడు వినాయకుడు.

చిట్టి చిట్టి కాళ్ళు, చేతులూ, చిరు బొజ్జ,  కుచ్చిళ్ళు దోపుతూ తెల్లని ధొవతి, దానిని శరీరం నుంచి జారనీయకుండా పట్టి ఉంచే వడ్డాణం, ముంజేతికి కంకణాలు, రత్నఖచిత చిరు కిరీటం అలరించి ముందుకు సాగుతున్న కాంతి పుంజంలా ఉన్నాడు గజాననుడు.

కాని అలా నడచి వస్తున్న మరుగుజ్జు రూపుడు వినాయకుడు గున గున నడుస్తున్న గుండ్రాయిలా కూడా అనిపించింది నారదునికి.

నవ్వితే అతని తల్లిదండ్రుల ఆగ్రహానికి గురికాగలనని తెలిసి తమాయించు కున్నాడు.
దగ్గరకొచ్చిన గజానుని చెయ్యార చేర దీసుకొని ఒళ్ళో కూర్చో పెట్టుకున్నాడు.

“ఇదేంటి! ఏం చేస్తారు దీంతో?” నారదుని వీణని చూపించి అడిగాడు వినాయకుడు.
“దీన్ని వీణ అంటారు. సంగీత వాయిద్యం. దీనికి నేను పెట్టుకున్న పేరు మహతి. మహతి లేకుండా నేను లేను..” చెప్పాడు నారదుడు.
“మీకు పిల్లల్లేరా?”
“లేరు”
“అందుకే మహతి ఉందన్నమాట. నాకు నేర్పిస్తారా సంగీతం?”
“ఓ, తప్పకుండా. ఇలా ఒళ్ళో పెట్టుకొని, ఒక చేత్తో స్వరాలు పలికిస్తూ మరో చేత్తో తీగ మీటు తుండాలి” నవ్వుతూ వినాయకుడి చేత వీణా వాదన చేయించాడు నారదుడు.
కొద్ది సేపట్లోనే అతడు స్వరాలు సొంతగా పలికించడం చూసి నారద, పార్వతీపరమేశ్వరులు ఆశ్చర్య చకితులయ్యారు.
వినాయకుడి బుజ్జిరూపం, ముద్దు పలుకులు నారదునికి ముచ్చట కలిగించాయి.అతన్ని వైకుంఠానికి తనతో తీసుకెళ్ళి లక్ష్మీ నారాయణులకు, తదుపరి తన తల్లిదండ్రులకు చూపించాలనుకున్నాడు.అదే మాట పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకున్నాడు.

“ముక్కు పచ్చలారని పసివాడు. వానికి వైకుంఠ ప్రయాణమా! మరోసారి చూద్దాం నారదా” పార్వతి అంది.
“నే వెళ్తానమ్మా వైకుంఠానికి, నాకేం భయం లేదు. నా గురించి భయపడకు. పంపించమ్మా” ప్రాధేయ పడ్డాడు వినాయకుడు.
“పసివాడు ఉబలాట పడ్తున్నాడు. వెళ్ళనీ దేవీ. నారదుని తోడు ఉండనే ఉంది. త్రిలోక సంచారి సహచర్యం మన చిన్నారికి లోకఙ్ఞానాన్నిస్తుంది” పరమేశ్వరుని ఆనతి.

“నాకు తెల్సు మాతా, వినాయకుని అంతటి ముద్దు బిడ్డని వదలి ఏ తల్లి ఉండగలదు. అలా వెళ్ళిఇలా వచ్చేస్తాం. మీరు బెంగ పడవద్దు. గజాననుని క్షేమంగా తిరిగి తెచ్చి అప్పగించే పూచీ నాది” అని నారదుడు అనడంతో పార్వతి ఊరట చెందింది.
వినాయకుని వైకుంఠపుర విహార యాత్రకి అంతా సిద్దమైంది. తల్లిదండ్రులకు నమస్కరించి వచ్చి నారదునితో “పదండి వెళ్దాం” అన్నాడు వినాయకుడు.
“నారదా… నడిపిస్తావా నా కుమారుణ్ణి” అడిగింది పార్వతి.
“లేదు మాతా! గజానుని కోసం ఒక వాహనం సిద్దం చేసాను. అనింద్యుడు.. అని ఒక మూషికం. మీ కుమారుని ప్రయాణం సుఖప్రదంగా సాగుతుంది” అంటూ తనతో తెచ్చిన ఆ ఎలుకపై గజాననుడు సుఖాసీనుడు అయ్యేలా ఏర్పాటు చేసాడు నారదుడు. ఇద్దరూ కలిసి వైకుంఠపురి వైపు కదిలారు.

మార్గ మధ్యంలో వినాయకుడు వేసే రకరకాల ప్రశ్నలకి సమాధానం చెబుతూనే అతనికి వేదాల సారాంశాన్ని తెలియ చేయడమే కాకుండా సంగీత శాస్త్ర పరిఙ్ఞానాన్ని కూడా నారదుడు కలిగించాడు. శ్రీ మహావిష్ణువు దుష్ట
శిక్షణ కోసం ఏ ఏ అవతారాలు దాల్చింది, ఆ అవతారాల్లో ఎవరెవరిని మట్టు పెట్టింది, వాటి ఆంతర్యం చెప్పసాగాడు.

అలా వినాయకునికి వివిధ రకాల విషయాలు ముల్లోకాలలో జరిగే విశేషాలు తెలియ చేస్తూ వైకుంఠ ద్వారం చేరుకున్నారు.

వాళ్ళకు ఆహ్వాన పూర్వకంగా తలుపులు తెరచుకున్నాయి. వినాయకుడు కళ్ళింతలు చేసుకొని అంతటా పరీక్షగా, ఆశ్చర్యంగా చూస్తూ నారదుని వెంటే నడుస్తున్నాడు. రెండవ ద్వారం దగ్గరకు రాగానే, అది కూడా తెరుచుకుంది.
“ఇంకా ఎన్ని ద్వారాలుంటాయేంటి?” కుతూహలంగా అడిగాడు వినాయకుడు.
“ఇంకా అయిదు ఉన్నాయి. మొత్తం సప్త ద్వారాలు వైకుంఠానికి” నవ్వుతూ సమాధానమిచ్చాడు నారదుడు.
“మాకైతే ఒకటే ద్వారం” అంటూ రెండవ ద్వారం దాటాడు వినాయకుడు.
అలా ఆరు ద్వారాలూ దాటి ఏడవ ద్వారం దగ్గర వినాయకుడు అడిగాడు “ఇది దాటగానే మీ నారాయణ తాత గారి యిల్లు కదా”
“అవును కుమారా… మహావిష్ణువు నివాసం ఇదే” చెప్పాడు నారదుడు.
ఏడవ ద్వారం దాటుతుండగా వినాయకునికి మహత్తేజంతో పన్నగ శయనుడై లక్ష్మీ సహిత మహావిష్ణువు కనిపించాడు. ప్రక్కనే వజ్ర మణి మయ భూషితయై మందస్మిత శ్రీ మహాలక్ష్మి.
“నారాయణ...నారాయణ… ప్రణామములు” అంటూ నారదుడు ముందుకు నడిచాడు.
ఆయన వెనకే వినాయకుడు కూడా వారిని సమీపించి ప్రణమిల్లాడు.
“ఆయుష్మాన్ భవ” దీవించాడు విష్ణుమూర్తి.
లక్ష్మీదేవి ముందుకు నడిచి వచ్చి ఆనందంతో వినాయకుడిని చేతులు చాచి దగ్గరకు తీసుకొని ఒడిని చేర్చుకుంది. వినాయకుడు అమ్మ ఒడిలో ఒదిగినంత సుఖంగా లక్ష్మీదేవి ఒడిలో ఒదిగి పోయాడు. ఆ క్షణాన నారదుని కళ్ళు ఆనందంతో వర్షించాయి.
విష్ణుమూర్తి ఆనంద పరవశురాలవుతున్న లక్ష్మీ దేవినే తదేకంగా చూస్తున్నాడు. అలా చూస్తున్న విష్ణుమూర్తి తో అన్నది శ్రీలక్ష్మి “స్వామీ వినాయకుని బుజ్జి రూపం కడు ముద్దొస్తున్నది కదా! మీ ఆశీస్సులతో ఈ బాలుణ్ణి పూజనీయుణ్ణి చేయండి”
“అవును దేవీ. నీవు కోరినట్లే ఈతను ముందు ముందు గణాలకు అధిపతి కాగలడు, విఘ్నేశ్వరుడుగా కొనియాడ బడతాడు. తదుపరి ఏ వ్రతమైనా, పూజ అయినా ముందుగా ఈ గణాధ్యక్షుని పూజించిన తర్వాత మాత్రమే జరుగ గలదు. అట్టి పూజయే శుభములనిచ్చునదిగా పరిగణింపబడును.” వినాయకుని దీవిస్తూ చెప్పాడు మహావిష్ణువు.

దూరంగా నిలిచి ఉన్న గరుడుణ్ణి, గుడ్లగూబని చూపిస్తూ “ అవి ఏంటి? ఎందుకున్నాయిక్కడ?” అడిగాడు శ్రీలక్ష్మిని వినాయకుడు.
“ అవి పక్షి జాతి జీవులు గరుత్మంతుడు మరియు గుడ్లగూబ. గుడ్లగూబ నా వాహనము, గరుత్మంతుడు శ్రీవారి వాహనము” నవ్వుతూ తెలియజేసింది లక్ష్మీ దేవి.

!!!!!!!!!!!!!!!!!!!!

“అంటే మనం యింటి ముందు ఫార్కింగ్ జెయ్యమా మన వాహనాలని, గదే మాదిరి గివి కూడా ఫార్కింగ్ జేసినవి వైకుంటం ల” పెద్దగా అంటున్నాడు సత్తి.

“అరేయ్ ఏందిరా సత్తిగా పార్కింగని కలవరిస్తున్నవ్ , లేవ్వా ఇంక?” చెక్కతో కొట్టి లేపుతూ అంటోంది సావిత్రి.

సత్తికి తెలివొచ్చింది. చవితి పదకొండు రోజులూ వినాయకుని పందిళ్ళ చుట్టూ తిరిగిన దాని ప్రభావం అని తెల్సుకున్నాడు. కళ్ళు తెరిచి లేచి కూర్చొని చుట్టూ పరికించి చూస్తూ “ ఇది కలా? నేనెక్కడున్నాను?” అన్నాడు సత్తి.

“కలనా! ఏం కలచ్చింది రా సత్తి? ఏదో వైకుంఠం అన్నావ్ … పార్కింగ్ అన్నావ్ “ కట్టె చేతిలో పట్టుకొని ఎదురుగా నిలబడి అడిగింది సావిత్రి.
కళ్ళు నలుపు కుంటూ “మంచి కలొచ్చిందక్కా.
నేనేమో BVMW కారు నడుపుకుంటూ అదెదో మాల్ కి వచ్చిన. నువ్వేమో అక్కడ ఫార్కింగ్ లో సిట్టీలు సింఫుతున్నవ్ అచ్చిన కార్లకి” సత్తి మామూలుగానే అబద్దాలతో ఆట పట్టిస్తూ చెప్పాడు.

“ సరిగ్గా కారు పేరు చెప్పనీకి రాదు, నువ్వు BMW నడుపుకుంట అచ్చినావురా. చంపేస్తా నిన్ను” అంటూ చేతిలో చెక్కతో రెండు తగిలించింది సత్తికి సావిత్రి.
లేచి పరిగెడుతూ “ నిజ్జం సాయిత్రక్కా. నేనేమో నా BVMW కారుని ఫార్కింగులో ఫెట్టి నీకు ఫది రూఫాయలు టిఫ్ఫిచ్చి మంచిగ జూసుకోమని సెఫ్ఫానన్నమాట” రెట్టింపు చేసాడు ఉడికించడం సత్తి.

“అరేయ్ సత్తీ నువ్వియాల నా చేతిలో చచ్చావురా!” అంటూ సత్తి వెనకే పరిగెడుతూ కట్టె విసిరింది సావిత్రి.
అది వెళ్ళి రెండు కాళ్ళ మధ్య పడి కాళ్ళకి అడ్డం పడడంతో సత్తి రోడ్డుమీద బొక్క బోర్లా పడ్డాడు.
భారికాయం అవడంతో మోకాళ్ళు మోచేతులు రెండూ బాగా దోక్కు పోయాయి.
దగ్గర కొచ్చిన సావిత్రి భయపడి పోయింది.
“ఎందుకురా సత్తి అట్ల పరిగెత్తినవ్ . నాకు కోపం తెప్పించినవ్ “ కళ్ళంబడి నీళ్ళు జల జల కారిపోతున్నయ్ సావిత్రికి.
కోపంతో తిట్టబోయిన సత్తి సావిత్రి కళ్ళల్లో నీళ్ళు చూసి ఊరుకున్నాడు. అలిగి పక్కకి తిరిగాడు.
“నేను మాత్రంఅనుకున్ననరా గిట్లయితదని. ఏదో కోపంలో ఇసిర్న” బుజ్జగింపుగా కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది.
సత్తి మాత్రం ఏం మాట్లాడ్డంలేదు. మోచేతి దెబ్బ మీద ఊదుకుంటున్నాడు.
సావిత్రే మళ్ళీ అంది “ క్షమించరా సత్తిగ. నువ్వు మాట్లాడకపోతే నాకు ఏడుపొస్తుంది”.
సత్తి మాత్రం మాట్లాడకుండా పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ ఇంట్లోకెళ్ళి మంచం మీద కూర్చున్నాడు.
వెనకాలే లోపలికి వచ్చిన సావిత్రి వంట గదిలోకెళ్ళింది.
గిన్నె నిండా వెన్న నింపుకొనొచ్చి సత్తి దెబ్బలకి రాయడం మొదలు పెట్టింది. అది చూసి సత్తికి మాట రాలేదు. మనసు వెన్నకన్నా ముందే కరిగి, సావిత్రి మీద కోపం పోయింది.
కళ్ళు తుడుచు కుంటూ “ తఫ్ఫంతా నాదే అక్కా…. నాకు అచ్చిన కల ఏరే అక్కా.  నీతో ఎకసెక్కాలాడాను. నన్ను ఛమించక్కా. నాకు దెబ్బల్ తాకి మంచిగయింది” అన్నాడు.

“ పొద్దుగల పొద్దుగల గిట్లయింది  మనకి. ఏ  బద్మాష్ గానిదో నజర్ తగిలుంటది మనిద్దరికి.” వెన్న రాయడం పూర్తి చేస్తూ అంది సావిత్రి.

సావిత్రి ప్రేమ ముందు దెబ్బల బాధ ఓడిపోడంతో నవ్వుతూ అక్క వంక  చూసాడు బిత్తిరి సత్తి.

*****************************************

( రా. శా. )

Comments

Popular posts from this blog

మృత్యువు కు చెక్

MMTS కధలు మృత్యువు కు చెక్ : చందానగర్ స్టేషన్ లో నేను ఎక్కాల్సిన MMTS బండి వచ్చి ఆగింది. టైమ్ చూసుకుంటూ బోగీ దగ్గరకి నడిచాను. బండి పావుగంట ఆలస్యం. ఇంకెక్కడా ఆలస్యం అవకుండా బండి నడిస్తే ఆఫీసుకు అయిదు నిముషాలు ముందు చేరుకుంటాను. లేదంటే బాసు పెట్టే నోటి వాతలకి సిద్దంగా ఉండాలి. అవును మరి, రచయిత జంధ్యాల గారికి కూడా తట్టని తిట్లు తిట్టగలడు మా బాసు. అంత కొత్తగా వేడిగా పడేవి మరి నోటి వాతలే కదా!  శరీరం మీది మామూలు వాతలైతే అంగీతోనో, పాంటు తోనో దాచుకోవచ్చు. కానీమా బాసు పెట్టే సెటైరిక్ శాడిస్టు నోటివాతలు, రెండు బదిలీల మీద రెండు ఆఫీసులు మారినా మర్చిపోలేం! బోగిలోకి ఎక్కి చక్రవర్తి కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడా? అని. కన్పడలేదు. చక్రవర్తి MMTS బయల్దేరే స్టేషన్ లింగంపల్లిలో ఎక్కుతాడు. తనప్రక్క సీటు నా కోసం ఆపి ఉంచుతాడు. ఇద్దరం ఒకే ఆఫీసు అవడంతో మా MMTS పయనం రోజూ మూడు యధార్ధాలు, ఆరు పుకారుల కబుర్లతో నడిచి పోతోంది. ఎప్పుడైనా ఎవ్వరం సెలవు పెడుతున్నా రెండో వాళ్ళకి చెప్పుకుంటాం. “ ఈ రోజు ఏమైంది తనకి” అనుకుంటూ ఖాళీగా కనబడ్డ సీటులోకి శరీరాన్ని చేర్చాను. “మీ బెటర్ హాఫ్ ఏడి సర్ , కనబడ్డం లేదు?” -...

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష! పదేళ్ళ క్రితం: "ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ . "మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి. ****** తొమ్మిదేళ్ళ క్రితం: " ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో. " అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి. ****** ఎనిమిదేళ్ళ క్రితం: "ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున. " అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు. ****** ఏడేళ్...
కిర్  కిర్   తలపులు నియమం: వ్రతాలు, రోజాలు, సువార్త కూటములు - ఆన్నింటిలో వ్యాపకం ఒకటే భజించడం .... దాగిఉందొక మూల వ్యాపకం తదుపరి భుజించడం