దంగల్ కరోనా తో
ఓటమి లేని పోరాటం - కరోనా!!
నీ జీవన రహస్యం తెలిసింది
మా స్వేఛ్ఛాస్వాతంత్ర్యాలు నీకు ఆయువు పట్టు
మా వ్రేళ్ళతోనే మా కళ్ళు పొడుస్తావు
మా హాహాకారం నీకు ఆహ్లాదం
మా ఖేదం నీ మోదం
మా విలాపం నీకు కరాళ నృత్యం
మావల్లనే పెరుగు తున్నావ్
మా చావును కోరుతున్నావ్
ప్రబలి ప్రబలి కబళిస్తున్నావ్
కలిసి ఉండి పోగొట్టు కోవడం కంటే
విడిచి ఉండి పొందడం సత్యం కదా!
విడిచి విడిచి తరిమేస్తాం!
నిన్ను నిలువరించడానికే నిర్ణయించుకున్నాను
నాబలహీనత నీ బలమని తెలుసుకున్నాను
కుటుంబాన్నీ, స్నేహాలనీ వద్దనుకున్నాను
వృత్తిని, ప్రవుత్తిని వదలుకున్నాను
నన్ను నేను ఒంటరి చేసుకున్నాను
అప్పుడే నువ్వు నిర్వీర్యం కాగలవు
నేను ఒంటరిగా గడిపే ప్రతి క్షణం
నీకు ఆయుక్షీణం అవుతోంది
నిన్ను మృత్యువుకు చేరువ చేస్తోంది
అదే నాకు విజయం
ఆ స్థళమే నాకు విజయ వేదిక
సరిహద్దుల్లో సైనికుడి సమరోత్సాహం
గదిహద్దుల్లో నాలో నిండిపోయింది!!
నాకు క్వారంటైన్ కాదు అపప్రదం
నా జాతికి అది సుఖప్రదం
పట్టుపట్టాను నేను
మట్టు పెడతాను నిన్ను!
కనపడకుండా మాయా యుద్దం
చేసే పిరికి ప్రాణివి నువ్వు
తోడెవ్వరు వద్దంటూ ఒంటరి యుద్దం
చేసే సాహస జీవిని నేను
ఈ ఉగాది ఆన! నర్తిస్తా నీ సమాధి పైన!
నా క్వారంటైన్ నీ చావుకు ముహుర్తం!
నా నిబద్ధతే నీకు మృత్యు శాసనం!
నా సహనమే నీకు మరణ మృదంగం!
నిన్ను గెలిస్తే మా వాళ్ళను కలుస్తా!
ఓడితే వాళ్ళ మనసుల్ని గెలుస్తా!!
( రా.శా.)
Comments
Post a Comment