నారాయణోద్భవం!!
( ఓ అర పేజీ కథ )
సుశీలమ్మ, ఆమె భర్త సుందరయ్య వాళ్ళిద్దరే ఆ ఫ్లాట్ లో ఉండేది. పిల్లలు లేని ఏకాకి జీవితం వాళ్ళది! సుశీలమ్మ రోజూ వంట చేసే ముందు, దేవుడి దగ్గర దీపం పెట్టి వచ్చి, స్తోత్రాలు, అష్టోత్తరాలూ ఇత్యాది చదువుతూ వంట పని సాగించేది. ఆ రోజు వారాన్ని బట్టి ఆ దేవుడి స్తుతి ఉండేది. ఇది ఒక టైమ్ టేబుల్ లాగా సాగుతూంటుంది. రోజూ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠనం మాత్రం తప్పనిసరి, దానితోనే రోజూ పఠనానికి ముగింపు. దాని వంతు వంట చివరలో సుమారు పన్నెండు గంటల సమయానికి వచ్చేది!
గత అయిదేళ్ళుగా, అంటే ఇప్పుడు ఉండే ఫ్లాట్ కొని, అందులో ఉండడం మొదలు పెట్టినప్పటి నుండీ సుశీలమ్మ ఇంటి పనిమనిషి రజని యే. సుశీలమ్మకి పని తొందర లేక పోవడంతో రోజూ సుమారు పదకొండున్నర సమయానికి అదే సముదాయం లోని వేరే రెండు మూడు ఫ్లాట్స్ లో పని చూసుకొని సుశీలమ్మ ఇంటి కి వచ్చేది రజని. అక్కడ పని ముగిసే సరికి ఒంటి గంట అయ్యేది. రజని వెళ్ళేటప్పుడు ఆ రోజు చేసిన కూరో, పప్పో కొంత ఇచ్చేది సుశీలమ్మ. సుశీలమ్మ వంటంటే రజనీకి చాలా ఇష్టం. పైపెచ్చు నిన్నటిదో మొన్నటిదో మిగిలినది కాకుండా అప్పుడే చేసినది పంచుకుంటున్నందుకు ఆమె అంటే చాలా గౌరవం కూడా రజనికి!
రోజూలాగే రజని పనికి వచ్చి పనిలో మునిగి పోయింది ఆ రోజు కూడా. కాకపోతే సుశీలమ్మే రోజూలా లేదు. కారణం ఆ రోజు తెల్లవారు ఝామున వచ్చిన కల! తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమౌతాయని నానుడి. అదే ఆమె భయానికి కారణం! ఆ రోజు తెల్లవారబోతుండగా వచ్చిన కలలో భర్త సుందరయ్య పరలోక ప్రాప్తి చెందడంతో, ఉలిక్కిపడి లేచింది సుశీలమ్మ. కల సంగతి సుందరయ్యకు చెబితే, తేలిగ్గా తీసుకుని పెద్దగా నవ్వేశాడు తనదైన శైలిలో. ఆ కల కారణంగానే సుశీలమ్మ చాలా దిగులుగా ఉంది! ఈ అరవయ్యో పడిలో భర్త లేని జీవితం ఊహకు వచ్చి, భయపడి పోతోంది రోజంతా!!
రజనితో ఏమీ మాట్లాడడం లేదు. విష్ణు సహస్రనామం పఠనం కూడా వినపడడం లేదు! తన పని తాను చేసుకుంటూ పోతున్నా, పఠనం వినపడక పోవడం వెలితిగా అన్పిస్తోంది రజనికి.
పఠించ కుంటే సుశీలమ్మ వంట, వినబడ కుంటే రజని పనులూ పూర్తవవు. అంట్ల పని పూర్తి చేసుకొని, బట్టలు ఆరేసే పనిలో పడింది రజని.
అప్పుడు చిన్నగా వినపడ సాగింది సుశీలమ్మ గొంతు నుండి వస్తున్న విష్ణుసహస్ర నామం. కానీ రోజూ ఉండే ఉధృతి లేదు గొంతులో.
మరికొద్ది సేపటికి, బట్టల పని ముగించుకుని, ఇల్లు తుడిచే పని పెట్టుకుంది రజని. సుశీలమ్మ ఆరోజు పఠనంలో చాలాసార్లు తడబడింది, రెండుసార్లు వల్లించిందే మళ్ళీ వల్లించింది. కారణం పఠించే దానిమీద ధ్యాస కుదరక పోవడమే! వంట గదిలో సుశీలమ్మ ప్రక్క నుండి తుడుచుకు వెళ్తోంది రజని.
"అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోక ధృత్ " దగ్గర ఆగింది సుశీలమ్మ గొంతు. ముందుకు వెళ్ళలేదు పఠనం. మళ్ళీ "అమానీ మానదో మాన్యో…." , ముందుకు వెళ్ళలేదు. ఎప్పుడూ లేంది ఆశ్చర్యంగా సుశీలమ్మ కు ముందు పంక్తి గుర్తుకు రావడం లేదు. మరోసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేసింది. ససేమిరా మెదడు సహాయ పడట్లేదు. కారణం ఆలోచనలు అడ్డురావడమే!
"సుమేదా మేదజో దన్యహ సత్య మేదా దరాదరహ" వత్తులు పలక్కపోయినా కొనసాగింపును అందించింది రజని గది తుడుస్తూనే!
పఠనంతో పాటు పనులన్నీ ముందుకు సాగాయి!!
( రా. శా. )
Comments
Post a Comment