గృహమే కదా సమర సీమ!!
ధీరుడైనా
భీరువైనా
దీని బుసకు భయపడాల్సిందే!!
కోటికి అధికారి అయినా
కూటికి బికారి అయినా
దీని కాటుకు బలవ్వాల్సిందే!!
లోకం చూడని పసికందులూ
లోకం కాచిన ముదుసలులూ
దీని కోరలకు ప్రీతిపాత్రులు!!
మందే లేని రోగం
మన ముందుకు వచ్చింది!
వినాశనం కోరే అతిధి
ఇంటి తలుపు తడుతోంది!
సందే ఇవ్వక మనం
అమర్యాదస్తులు అవుదాం!
వచ్చిన దారినే పొమ్మని
నిష్కర్షగ ద్వారాలు మూసేద్దాం!!
అంట రాని తనం చూపించు
వెంట రాకనే మరణించు!!
కరుణ లేని కరోనా పై
సమర శంఖం పూరించు!!
జనతంతా ఏకమై
జగమంతా ఒక్కటై
పోరాడాల్సిన సమయం!!
తోసుకు రాలేదు ఈ తెంపరి
మోసుకు వచ్చిన మహమ్మారి
పూసుకు తిరగక మరి
దూరంగ ఉంచడమే మనకు దారి!!
ప్రత్తి ఒత్తిగా
రూపం మార్చుకొని
దీపం లో నిలిచి
వెలుగు పంచలేదా!!
వెదురు వేణువై
మధుర రాగాలను
పలికేందుకు
ఆలంబన అవడంలేదా!!
పరకలే అయినా పేనుకుపోయి
బంధాలను వదలి బంధమై నిలిచి
ఇంట నే నిలిచి
రచ్చన గెలుద్దామా!!
ఇంటి గడపే మనకు హద్దు!
పదిమంది లో/తో తిరుగ వద్దు!
అందరి ఆరోగ్యం ముద్దు!!
సమర వీరులం అవుదాం!
అమర వీరులం కాక నిలుద్దాం!!
Comments
Post a Comment