అది అండమాన్ దీవుల్లోని ఒక చిన్న దీవి. ముఖ్యపట్టణం పోర్టు బ్లేయర్ నుండి రెండు గంటల ప్రయాణం. ఊరు అనుకునేంత పెద్దది కూడా కాదు. అది ఒక వినోద విహార యాత్రా స్థలం. అక్కడ నివాసం ఉండేది అరవై నుండి డెభై కుటుంబాలే. కొంతమంది బెంగాలీలు, మరికొంత మంది తెలుగు శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల కుటుంబాల వారు.
తొంభై శాతం యాత్రికులు పోర్టుబ్లేయర్ నుండి ప్రొద్దున వచ్చి సాయంత్రం తిరిగి వెళ్ళిపోతుంటారు. అక్కడి వాటర్ స్పోర్ట్స్ చాలా ప్రాముఖ్యం. ఇంకో కారణం - అక్కడి సముద్ర తీరం పటిక వేసి తేర్చిన నీరులా స్పష్టంగా, కాలుష్య రహితంగా ఉంటుంది! యాత్రికులే ఆ దీవికి వరం, జీవం. సంవత్సరంలో జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉండే వర్షాకాలంలో అక్కడ యాత్రికుల సంచారం ఉండదు! ఏడు నెలలు కష్టపడి సంపాదించేది ఆ అయిదు నెలలు బ్రతికి ఉండడానికే!
యాత్రికుల సేవే పరమార్ధంగా జీవనం అక్కడి వాసులకి. వారి మాటల్లో వేదాంతం, సేవల్లో అంకిత భావం యాత్రికులకు హత్తుకుపోతాయి. కొద్ది గంటల విహారం కోసం వచ్చే వారికి ఆహ్లాదాన్ని కలగజేయడమే వారి వృత్తి.
కానీ సంవత్సరంలో రెండు మూడు సార్లు వచ్చే తుఫాన్లే ఆ దీవికి శాపం! ఒక్కో తుఫాను ఒక్కో విషాదాన్ని మిగుల్చుతుంటుంది అక్కడి కుటుంబాల్లో. కుటుంబాలు తుఫాన్ల తాకిడికి ఛిద్రమై పోతుంటాయి. ఒక్కో ఇంటిది ఒక్కో గాథ! కానీ ఇవేవీ అక్కడి వారి ముఖాల్లో కనపడవు.
*******
అది తుఫాను చుట్టం తప్పకుండా వచ్చి పలకరించే నవంబరు నెల. వాతావరణ శాఖవాళ్ళు రెండురోజులు ముందుగానే హెచ్చరికలు చేశారు, తుఫాను వచ్చే అవకాశం ఉన్నట్లు. తుఫాను సమయంలో అవసరమైతే ఆఘమేఘాల మీద జనాన్ని పోర్టుబ్లేయర్ కి తరలించే ఏర్పాటు చేసుకున్నారు. గంటలు గడిచే కొద్దీ తుఫాను తీవ్రంగా బలపడ సాగింది. చివరకు అది పెను తుఫానుగా మారి ఆ దీవిని సుమారు సాయంత్రం ఆరు గంటలకి తాకచ్చని అంచనా వేశారు! దాంతో పోర్టుబ్లేయర్ లో పునరావాస కేంద్రాలకు దీవిలో ఉన్న యాత్రికులనీ, నివాసుల్నీ తరలించాల్సిన అవసరం వచ్చింది.
పది గంటల్లో దీవి నుండి అందర్నీ తరలించాలని రెండు మోటరు బోట్లను నాలుగు సార్లు తిరిగేలా సిద్దం చేసారు. తరలించడం ఆలస్యం అయినా, వాతావరణం అనుకూలంగా లేక పోయినా నాలుగు ట్రిప్పులు ఉండవు.
దీవిలో ఎవ్వరూ ఉండకూడదని, అందరూ వెంటనే ఉన్న పళంగా ఖాళీ చేయాలని ఆదేశించారు.
తుఫాను తీవ్రరూపం దాల్చింది! నాలుగు పర్యాయాలు తిరగాల్సిన పడవలు రెండు పర్యాయాలకే పరిమితమైనయ్ ! మొదటి ట్రిప్ లో విహారానికి వచ్చిన యాత్రికులని, వృద్ధులనీ తరలించారు. రెండొ విడత లో స్త్రీలకూ, పిల్లలకూ ప్రాధాన్యత నిస్తూ వీలైనంత మందిని తరలించాలి అని నిర్ణయించారు. వాతావరణం అనుకూలిస్తే మరో ట్రిప్పు, లేకుంటే దీవిలో మిగిన వాళ్ళకు అది కాళ రాత్రే!
*****
వెంకటపతి, ఏడేళ్ళ కూతురు వరలక్ష్మిని భుజాన పెట్టుకొని పరుగులాంటి నడకతో పడవ వచ్చేవైపు పరిగెడుతున్నాడు. అతని ఎడమ చేతి లో ఉంంది ఓ సంచీ ఊగుతూ. అందులో ఉన్నవి కొద్దిపాటి బట్టలు, కొన్ని వస్తువులు, ఫ్రేమ్ కట్టబడిన ఫోటో, ఓ డబ్బాలో కొన్ని డబ్బులూ! కుడిచేత్తో వరలక్ష్మిని పట్టుకున్నాడు పడకుండా. వరలక్ష్మి కూడా పడకుండేందుకు తండ్రి తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. వరలక్ష్మి వేసుకున్న తండ్రి చొక్కా వెంకటపతిది కావడంతో అది ఆ అమ్మాయి మోకాళ్ళని దాటి ఉంది.
"నాయనా, యాడికి?" అరుస్తున్నట్టుగా అడిగింది తండ్రి వెంకటపతి ని.
"పడవొస్తందమ్మా. ఎళ్ళి ఎక్కాల"
"ఎందుకు?"
"తుఫాను ముంచు కొస్తంది. ఇక్కడే ఉంటే సచ్చిపోతాం"
అతని నడక పరుగైంది. ఎందుకంటే ముందు ఎక్కిన వాళ్ళకే పడవలో చోటు! ఇంకో పడవ వస్తుందో రాదో తెలియదు!
"మరి మనిల్లు?" ఆందోళనతో వరలక్ష్మి అడిగింది.
"తుఫాను పోయాక మళ్ళొస్తాం"
"నేనాడుకునేయన్నీ ఇంట్లోనే ఉన్నాయ్ "
"ఉంటయ్ లే యాడికీ పోవు. మళ్ళొస్తాంగా "
"నువ్వు అట్లగే సెబ్తావ్ … పోయిన సారొచ్చిన తుఫాను అమ్మని లాక్కెళ్ళింది సముద్రం లోకి. ఇంతవరకూ పంపించలా" అమాయకంగా వరలక్ష్మి మాటలు.
" ఈసారి అట్ట కాదులే" అంటూనే చేరుకున్నాడు ఒడ్డు దగ్గరకి.
వరలక్ష్మిని భుజం మీద నుండి దించాడు. అప్పటికే గవర్నమెంట్ వాళ్ళ పడవ వచ్చి ఉంది.
" నేనడిగొస్తా, ఈడే ఉండు" వరలక్ష్మిని ఒకచోట ఉంచి పడవ వైపు వెళ్ళాడు.
కొద్దిసేపటికి వచ్చి, "నేను ఎనక పడవలో వస్తాను… ఇప్పుడు నువ్వు ఎక్కాలి, పద" అన్నాడు వెంకటపతి కూతురుతో.
"నేనెల్లను నువ్వుగూడా రా ! వస్తేనే ఎక్కుతా"
"కాదు బుజ్జెమ్మా, ఇప్పుడు నన్ను రానీయరంట! నేను ఇంకో పడవలో వస్తాగా. మా తల్లే! ఎక్కేయమ్మా" బ్రతిమాలాడాడు వెంకటపతి.
" నేనెల్లను నాయనా నువు లేకుండా! నీ తోనే నేనూ వస్తా!" ఏడుస్తోంది వరలక్ష్మి వేసుకున్న చొక్కాతో కళ్ళు తుడుచు కొంటూ.
వెంకటపతి చేయి వదలడం లేదు వరలక్ష్మి.
"ఆడ సీట్లయిపోతే కింద కూసోపెడ్తారు, జల్దీ ఎక్కేసేయ్ తల్లీ"
"నువు లేకుండా నాకు బయ్యం. నేనెక్కను" భయంతో వచ్చిన మొండి తనపు సమాధానం వరలక్ష్మి నుండి.
" అదుగో అటుసూడు… నీ ఫ్రెండ్సు కూడా ఎక్కారు"
"ఆళ్ళ అమ్మ ఉంది ఆళ్ళతో… నాకేది"
"ఇదుగో ఇందులో ఉంది మీ అమ్మ. నీ ఒళ్ళోనే పెట్టుకో. నీకేం గాకుండా సూసుకుంటది" సంచీలో ఉన్న ఫోటో బయటకి తీసి చూపించాడు వెంకటపతి.
ఆ ఫోటో రేండేళ్ళ క్రితం వరలక్ష్మి పుట్టిన రోజు నాడు వెంకటపతి, భార్యా, వరలక్ష్మి తీయించుకున్నది. తల్లిదండ్రుల మధ్య వరలక్ష్మి నవ్వుతూ, ఇద్దరి భుజాల మీదా చేతులేసి! ఫోటో లో వాళ్ళ అమ్మనే చూస్తోంది వరలక్ష్మి. వరలక్ష్మి కంటి నుండి జారిన కన్నీరు ఫోటోలో తల్లి ముఖం మీద పడింది.
"ఎక్కండి సూత్తారేం" బోటు లోంచి ఎవరో అరిచారు.
"ఎంకటపతీ ఎక్కించు బుజ్జిని" అరిచాడు బోటు మెకానిక్ .
"భయమేస్తే పోటోని గట్టిగా పట్టుకో, అదే పోద్ది!" చెప్పాడు వెంకటపతి వరలక్ష్మిని బోటులోకి ఎక్కిస్తూ.
కళ్ళు తుడుచుకుంటూ ఎక్కింది వరలక్ష్మి! పడవలో తెలిసిన కుటుంబం వాళ్ళకి వరలక్ష్మిని అప్పచెప్పాడు చూసుకోమని. వాళ్ళు భరోసా ఇచ్చారు చూసుకుంటామని. పునరావాసాలకి వెళ్ళడం, వారం తర్వాత తిరిగి రావడం అక్కడి కుటుంబాలకు అలవాటై పోయింది!
"ఈళ్ళతోనే ఉండు. ఆళ్ళు యాడికెళ్తే ఆడికే ఎళ్ళు" చెప్పాడు వరలక్ష్మికి.
బోటులోంచి క్రిందకి దిగబోతూ ఒకసారి వెనక్కి తిరిగి చేయి ఊపాడు. బిక్కుబిక్కు మంటున్న వరలక్ష్మి కూడా చేయి ఊపింది అతన్ని చూస్తూ. అతనికి తెల్సు, మరో బోటు రాదని! ఆ రాత్రి కి తుఫాను నుండి బయట పడడం, తిరిగి తన కూతురును కలవడం జరగని పని అని అతని అనుభవాలు గుర్తు చేస్తున్నయ్ ! ఒక రకంగా చెప్పాలంటే దీవిలో మిగిలిన వాళ్ళంతా నూకలు చెల్లిన వాళ్ళే! నాల్గు నెలల క్రితం వచ్చిన ఓ తుఫాను వెంకటపతి భార్య ని బలి తీసుకుంది! అప్పుడే దీవిని వదలి వచ్చేయమని ఇంటి నుండి పిలుపు. తాను మాత్రం చావైనా బ్రతుకైనా దీవితోనే అనుకున్నాడు!
వెంకటపతి దిగిన వెంటనే బోటు ముందుకు సాగింది.
అంతకుముందు సంచీ లోనుండీ ఫోటో తీస్తున్నప్పుడు క్రింద పడిన వరలక్ష్మి గౌను, గాలికి వచ్చి అతని కాళ్ళకు చుట్టుకుంది.
గౌను చేతిలోకి తీసుకుని మోకాళ్ళ మీద కూర్చుండి గౌను వంకే చూస్తుండి పోయాడు వెంకటపతి!!
చేతిలో గౌను బొట్టుబొట్టు తడుస్తోంది!
నిజానికి వరలక్ష్మికీ, వెంకటపతికీ ఇద్దరికీ బోటులో సీట్లు దొరికినయ్ ! కానీ అక్కడకు విహారానికి వచ్చి తిరిగి వెళ్తున్న ఓ కొత్త దంపతుల జంటలో ఒక్కరికే సీటు దొరికింది, రెండోది వెంకటపతిది!!
*********
( రా.శా. )
Comments
Post a Comment