హెర్క్యూలెస్ :
“ఇదుగోండి… మీ అపురూపం. ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి కొత్త ఇంట్లో” అంటూ సారధి చేతిలో పాత సైకిల్ బెల్ పెట్టేసి వెళ్ళింది అతని భార్య వకుళ.
చేతిలో ఉన్న బెల్ ని ఎదురుగా ఉన్న టీపోయ్ మీద పెట్టాడు. తళ తళ మెరుస్తోన్న ఇత్తడి సైకిల్ బెల్ ! అది అతనికి ఎంతో అపురూపం. ఆ సంగతి ఆ ఇంట్లో అందరికీ తెల్సు. అందుకే కొత్తగా మారిన సొంత ఇంట్లో దాన్ని ఎక్కడ భద్రపరచుకుంటాడో తన ఇష్టం అని వకుళ ఆలోచన.
సారధి ఆ బెల్ వంకే తదేకంగా చూస్తున్నాడు. అది వాళ్ళ నాన్న వాడిన సైకిల్ - హెర్క్యూలెస్ ది. సైకిల్ ముందు, వెనక చక్రాల మీద ఉండే మడ్ గార్డ్ ల మీద హెర్క్యూలస్ కంపెనీ లోగో -భూగోళాన్ని తన భుజాల మీద మోస్తూన్న ఓ మహాబలుడు. దర్శకుడు రాజమౌళి చిన్నప్పుడు వాళ్ళింట్లో కూడా ఈ హెర్క్యూలెస్ కంపెనీ సైకిల్ ఉండి ఉంటుంది! నిజాయితీగా ఒప్పుకుంటే, బాహుబలిలో ప్రభాస్ చేత శివలింగం భుజాలమీద మోసే సన్నివేశానికి ప్రేరణ ఇదే కావచ్చు!
ఆ సైకిల్ నాన్నకి తను పనిచేసే కంపెనీ వాళ్ళు ఇచ్చినది. మొదట అది కంపెనీ వాళ్ళదే! కొన్ని సంవత్సరాల తర్వాత కంపెనీ వాళ్ళు వేసిన వేలంలో వాళ్ళ నాన్న దాన్ని సొంతం చేసుకున్నాడు! అప్పటి నుండి అది సారధి వాహనం అయిపోయింది. తను సైకిల్ త్రొక్కడం నేర్చుకున్నది దాని మీదనే! తన మోచేతులు మోకాళ్ళ మీద ఉన్న దెబ్బల మచ్చలని వేసుకున్న బట్టలు కప్పేస్తున్నా, ఆ బెల్ మీద పడిన సొట్టలు మాత్రం తన సైకిల్ ప్రహసన చిహ్నాలుగా తీయగా, సుఖంగా వెక్కిరిస్తుంటాయ్ ! ఆ సొట్టల వయస్సు దగ్గర దగ్గర నలభై అయిదు ఏళ్ళు.
సారధి చేతిలో ఉన్న చెంచాతో దానిపైన మోదాడు. ఠంగ్ మని మ్రోగింది… అంతే కాదు దాని ధ్వని తరంగాలు ప్రతిధ్వనించాయ్ సారధి కూర్చున్న గది అంతటా! వడివడిగా గది దగ్గర కొచ్చి నిల్చున్న వకుళ వైపు చూశాడు. ఆమె కళ్ళతోనే ఏంటి అన్నట్లు సంజ్ఞ చేసింది నర్మగర్భం గా నవ్వుతూ!
“ అబ్బే… అదేంకాదు. వొట్టినే మోగించాను “ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. వకుళ సారధి తో చూపులు కలిపి ఉంచింది కొద్దిసేపు పాత సంగతులను త్రవ్వుతున్నట్లుగా.
“నిజంగానే… వొట్టినే! అయినా థేంక్స్ . ఆ రోజుల్ని గుర్తు చేసి నందుకు” సారధి అంటూంటే వకుళ వంటింటి వైపు నడిచింది.
ఆమె వెళ్ళిన వైపే చూస్తున్నాడతను.
వకుళ నర్మగర్భంగా నవ్వడానికి కారణం - పెళ్ళైన క్రొత్తల్లో రాత్రిళ్ళు వకుళ అత్తగారితో ఇంటి పనుల్లో మునిగి పోయినప్పుడు “ఇక్కడ నేనొకడ్ని వేచుక్కూర్చున్నాను” అని గుర్తు చేసినట్లు ఆ ఇత్తడి బెల్ సారధి చేయి జారుతుండేది. కొద్ది రోజులకే ఇది గ్రహించిన అత్తగారు “బెల్లు శబ్దం వచ్చే లోపే ముగించేద్దాం” అని పనికి ముందే చెప్పడంతో బెల్ సారధి చేజారడం ఆగి పోయింది. ఆజ్ఞాపకాల సుగంధం సారధి పెదాల మీద చిరునవ్వుగా మారింది. చేతిలోని ఇత్తడి బెల్ మెరూస్తూంటే బొటనవ్రేలుతో సొట్టలోని గుంటను తడుముతుంటే ఆలోచనలు వెనక్కి ప్రయాణించాయ్ సారధికి.
***********
“ ఏంటి వీడు పడుకొన్నాడు, ఒంట్లో బాగా లేదా?” ఇంట్లోకి వస్తూ నాన్న అన్నాడు.
“ అదేం లేదు, ఎవరో స్టూడెంట్ సంఘాల వాళ్ళు వచ్చి స్కూలు మూయించారుట. అన్నం తిన్నాడిప్పుడే ఓ పావుగంట క్రితం” అని నాన్నకి చెప్పి, “నాన్నొచ్చారు… లే” అని నాతో అంది.
అంతా కళ్ళు మూసుకొని వింటున్న నేను బదులు పలకలేదు. నిద్ర నటిస్తున్నాను. నాన్న బట్టలు మార్చు కుంటున్నట్లు, అమ్మ నాన్నకి అన్నం పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు శబ్దాలు చెబుతున్నాయ్ .
క్రింద చాప మీద పడుకున్న నాకు నాన్న నా దగ్గర కొచ్చినట్లు అడుగుల అలికిడి అయింది. నాన్న నా నుదుటి మీదా, గొంతు దగ్గరా చేయి పెట్టి చూస్తుండగా, అమ్మ “అన్నం వడ్డించాను రండి” అనడం తో వంటిట్లోకి వెళ్ళాడు.
నేను నాన్న రాగానే, లేదా అమ్మ లెమ్మనగానే లేచుండాల్సింది. ఎందుకు లేవ లేదో నాకే తెలియదు. లేని నిద్ర నటిస్తున్నాను, నిష్కారణంగా! ఒక్కోసారి అంతే… మనం మొండిగా, పంతంగా అనవసరపు పనులు కొన్ని చేస్తూంటాం. దానికి ఇదీ అని కారణం ఏముండదు. నాదీ అదే పరిస్థితి.
నాన్న అన్నం తిని వచ్చేసరికి, నేను లేచి చేతిలో పుస్తకం పెట్టుకు కూర్చున్నాను. నాన్న వచ్చి నా ప్రక్కనే కూర్చుని “ టెరమ్ ఫీ ఎప్పటి లోపు కట్టాలన్నావ్ “ అడిగాడు.
“ఇంకా రెండు రోజులుంది. ఆ తర్వాత ఫైన్ తో కట్టాలి” చెప్పాను.
కాసేపటికి నాన్న లేచి జేబులోంచి డబ్బులు తీసి ఇస్తూ “రేపు కట్టేయ్ , డబ్బులు జాగర్తగా పెట్టుకో” అని చెప్పి వెళ్ళి మంచం మీద నడుం వాల్చాడు.
ఆ ఇంట్లో మాకు ఉన్నది రెండే గదులు - ఒకటి పేద్ద హాల్ వంటిది, రెండోది వంట గది. పడుకున్నా, చదువుకున్నా, ఇండోర్ గేమ్స్ ఆడుకున్నా అన్నీ అందరూ ఆ హాల్ లాంటి గదిలోనే!
నేను లేచి డబ్బులు జాగ్రత్త చేసుకొని వచ్చి మళ్ళీ పుస్తకం పట్టుక్కూర్చున్నాను.
వంట ఇంట్లో శుద్ధి చేసి వచ్చి తన పాత చీరెని చుట్టగా చుట్టి, హాలు దగ్గర గడపలో పెట్టి, వారపత్రిక పట్టుకొనొచ్చి, చీరెచుట్టు మీద తలపెట్టి పడుకుని చదవ నారంభించింది అమ్మ.
నేను నాన్న వైపు చూశాను. కళ్ళు మూసుకుని ప్రక్కకి తిరిగి పడుకుని ఉన్నాడు.
మరికొద్ది సేపటికి అమ్మకూడా పుస్తకం ప్రక్కన పడేసి కళ్ళు మూసుకుంది.
మరో అయిదు నిముషాలు చూసి నేను మెల్లగా లేచి మంచం ప్రక్కనే ఉన్న బల్లమీద ఉన్న నాన్న సైకిల్ తాళం చెవి తీసుకున్నాను శబ్దం కాకుండా!
మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ గడపలో పడుకున్న అమ్మని దాటుతుండగా అమ్మ “ఎక్కడకి ఎండలో “ అని అడిగింది.
కళ్ళు మూసుకొనే చూడగలదా అమ్మ? లేక నా కదలికలని పసి కట్టేసిందా? అదే అయి ఉంటుంది! నా మొదటి కదలికలు ఆమె కడుపులోనే కదా!
“ ఇప్పుడే వస్తా “ అడిగిన దానికి సూటిగా లేదు నా సమాధానం.
“ త్వరగా వచ్చేయ్ . నాన్న వెళ్ళాలి మళ్ళీ” అమ్మ హెచ్చరిక. అంటే నేను సైకిల్ తాళం తీయడం తెలిసి పోయింది ఆమెకు.
అమ్మ కళ్ళు మూసుకొనే గమనిస్తూంటుంది. ఆమె పడుకుంటుందికానీ నిద్ర పోదు. ఆమెకి కావలసింది కొంత అలసట తీరడం కాసేపు, అంతే! మళ్ళీ పదిహేను ఇరవై నిముషాల్లో లేచి కాఫీ పెట్టడం మొదలు పెడ్తుంది నాన్న కోసం తన కోసం.
మెల్లగా బయటకి వచ్చి ఇంకా మెల్లగా శబ్దం రాకుండా సైకిల్ తాళం తీసి బయటకుతెచ్చాను. మేముండే వీధీ చాలా పొడుగైనది, దాన్లో ఓ మూడు చుట్లు తిరిగామంటే అరగంట ఐపోతుంది.
మా వీధి దారంతా మట్టి రోడ్డు అవడంతో ఎత్తు పల్లాలు ఎక్కువ, పైగా వీధి చివర పల్లం. నాకు అప్పటికింకా సైకిల్ సీటు మీద కూర్చోని త్రొక్కడం రాదు. మా స్నేహితులందరికీ వచ్చు, అందుకే వాళ్ళ దగ్గర చిన్నతనంగా ఉండేది. మాకు పాలు పోసే చుక్కయ్య కూతురు కూడా పాలు ఇళ్ళల్లో ఇవ్వడానికి సైకిల్ సీటు త్రొక్కుతూ వస్తుంది!
ఎండాకాలం మిట్టమధ్యాహ్నం అవడం తో రోడ్డు మీద జనసంచారం లేదు, అప్పుడప్పుడూ వచ్చే సైకిల్స్ , రిక్షాలు తప్ప!
సీటు త్రొక్కడం (అంటే సీటు ఎక్కి సైకిల్ త్రొక్కడం ) కు అనువైన సమయమని పించింది. ఒక చుట్టు అడ్డకాలు వేసి త్రొక్కిన తర్వాత, రెండో రౌండులో సీటు ఎక్కడానికి ధైర్యం చేశాను. కానీ భయంతో ఎక్కువ సేపు కూర్చోక మళ్ళీ అడ్డకాలు త్రొక్కుడుకు వచ్చేశాను. మూడో చుట్టులో సీటెక్కి , పూర్తిగా అందని పెడల్స్ ని కాళ్ళతో దగ్గరకు తన్నుకుంటూ తొక్కుతున్నాను. సీటు వచ్చేసింది ( అంటే త్రొక్కడం ) అనే ఆనందం, ఉత్సాహంలో వీధి పల్లం లోకి వచ్చానని గమనించలేదు. త్రొక్క కుండానే సైకిల్ వేగం పెరిగింది. బ్రేకులు చేతి దగ్గరే ఉన్నా వెతుక్కుంటున్నాను. గతుకుల్లో ముందు చక్రం ఎగిరెగిరి పడుతోంది! ఆ ఎగురుడులో ప్రక్కగా వెళ్తున్న రిక్షాని తప్పించబోయి, సైకిల్ అదుపు తప్పి ప్రక్కనే ఉన్న లైటు స్తంభాన్ని, గుద్దు కోవడం, బావిలో ఈదే కప్ప లాగా చేతులూ, కాళ్ళూ చాపి రోడ్డుకు అతుక్కుపోయినట్లు నేను పడ్డం జరిగి పోయాయ్ !
చుట్టూ చూశాను… ఎవరూ లేరు. సహాయం కోసం కాదు, "నేను పడ్డం ఎవరూ చూళ్ళేదు కదా " అని తెల్సుకోడానికి. మెల్లగా ముందు నేను లేచి తర్వాత సైకిల్ లేపాను. ఇనప స్తంభం తగలడంతో ఇత్తడి బెల్లు సొట్ట బడింది. ముందు చక్రం వంకర పోయి అది మామూలుగా కాక ఎనిమిది అంకె వేస్తోంది నడుపుతుంటే! ముందు చక్రం లేపి పట్టుకుని సైకిల్ తోసుకుంటూ ఇంటికి చెర్చాను.
అప్పటికే నాన్న వెళ్ళడానికి తయారైపోయాడు. దోక్కుపోయి మోచేతులూ, మోకాళ్ళ నుండి కారుతున్న రక్తం నాన్న కంట పడింది. ఒక్కసారి గా చెంపకి గానీ, వీపుకు గానీ రాబోయే కష్టాన్ని ఊహించు కొన్న మెదడు, కళ్ళనీళ్ళు చిమ్మించింది.
ముందుకు వచ్చి నా చేతిలోంచి తాళం లాగేసుకొని ముందుకు నడుస్తున్న నాన్నకు వినపడేటట్లు " ముందు చక్రం వంకర పోయింది" అన్నాను. అది విన్న ఆయన తాళం చెవిని ప్రక్కనే ఉన్న బావి గట్టుమీద పెట్టేసి పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ ముందుకు నడిచాడు. ఆ అడుగులు నా మీద కోపాన్నో, ఆఫీసుకు టైమ్ అయిపోతున్నందుకు పడ్డ తొందరనో దేన్ని చూపించాయో తెలియలేదు నాకు.
గదిలోకి వెళ్ళ బోతూన్న అమ్మకి గుమ్మం దగ్గర నాన్న చెప్పులు కనిపించాయ్ ! "పరిగెత్తుకెళ్ళి ఇచ్చిరా నాన్నకి, మరిచి పోయారట్లుంది" అమ్మ మాట పూర్తవుతూనే చెప్పులు చేత పట్టుకున్నాను. అప్పుడు తెల్సింది ఒక చెప్పు తెగి ఉందని, అందుకే నాన్న వదిలేశారని. అమ్మకు చూపించాను తెగిన చెప్పుని.
"అయ్యో!! చెప్పులూ లేక, సైకిలూ లేక ఈ ఎండలో ఎలా వెళ్తారాయన? వెధవ సైకిలు ఇప్పుడే నేర్చుకోవాలా? ఆదివారం ఒకటి ఉందికదా, ఆయనే నేర్పే వారు కదా? బయటికెళ్ళి చూసి రా! రిక్షా అయినా దొరికిందో లేదో ఆయనకి " అమ్మ నిప్పులు చెరిగింది.
పరిగెత్తుకెళ్ళి వీధిలోకి చూశాను. ఎక్కడా నాన్న జాడ లేదు. అంత వడివడిగా నడిచేశారన్నమాట. లోపలి కొచ్చి అమ్మకు అదే చెప్పాను. నాన్నకు కలిగిన కష్టానికి అమ్మ కు వచ్చిన కోపం, బాధ ఎంతో నా రెండు చెంపలకి తెల్సింది!
మంచం ప్రక్కన కూర్చుని వెక్కిళ్ళు పెడ్తున్న నాకు మంచి నీళ్ళ గ్లాసు ఇచ్చింది తాగమని. ప్రక్కన కూర్చోని, బోరిక్ పౌడర్ నా దెబ్బలకు అద్దుతూ, చీరె కొంగుతో కళ్ళు వత్తుకుంది. ఆమెకు తెల్సు జరిగిన సంఘటనల్లో తప్పెవరిదీ లేదని, ఒక్క అనుమతి లేకుండా నాన్న ఆఫీసు సైకిల్ తీయడం తప్ప. ఇంతకు ముందు కూడా మూణ్ణాలుగుసార్లు ఆ రోజు లాగే నేను సైకిల్ తీసుకెళ్ళి నాన్న ఆఫీసుకు వెళ్ళేలోపే తెచ్చి పెట్టేయడం అమ్మ చూసింది.
"సాయంత్రం చల్ల పడ్డాక వెళ్ళి బొడ్డురాయి పక్కన చెప్పుల వాడుంటాడు, కుట్టించుకురా" లేస్తూ అమ్మ చెప్పింది.
ఆ రోజు రాత్రి మంచం మీద పడుకున్న నాన్న అరికాళ్ళకు అమ్మ మందు రాస్తోంది.
ఇంకో రెండు రోజుల్లో వచ్చే ఆదివారం వరకు నాన్నకి ఈ నడక తప్పదేమో! నాన్న ఆఫీసుకు తోమ్మిదింటికల్లా వెళ్ళాలి. అప్పటికి సాంబయ్య సైకిల్ రిపేరు షాపు పూర్తిగా తెరుచుకోదు. ముందుగా పనికుర్రాళ్ళు వచ్చి షాపు తెరిచి చిన్న చిన్న పనులు - గాలి కొట్టడం, పంక్చర్ వేయడం లాంటివి చేస్తూన్నా, మా సైకిల్ కి వచ్చిన చక్రం వంకర తియ్యడం లాంటి వాటికి మాత్రం సాంబయ్య రావాల్సిందే! అందుకే నాన్నకు మరో రెండ్రోజుల నడక తప్పదు. రెండు పూటలా రిక్షాలో వెళ్ళి రాగల స్థోమతు లేదు!
కొంచెం దూరంలో పుస్తకం పట్టుకు కూర్చున్న నన్ను పశ్చాత్తాపం దహించేస్తోంది, కణ కణ కాలే నిప్పుల్లో మొక్కజొన్న కండె కాలినట్టు!
"చెప్పు తెగ్గానే కుట్టించుకోవాల్సింది" అమ్మ అన్నది.
"చూశాను… ఆ ఎండలో ఎవరూ కూర్చోట్లా" నాన్న సమాధానం.
ఆయనకి నా మీద కోపమొచ్చిందో లేదో నాకు తెలియ లేదు.
ఆ రోజు అమ్మ నన్ను కొట్టింది - బాధ మర్చిపోయాను, నావల్ల నాన్నకి కష్టమొచ్చింది కనుక!
నాన్న నన్ను కొట్టలేదు, నా వల్ల ఆయనకి కష్టమొచ్చినా - మర్చిపోలేక పోతున్నాను !!
**************
ఆ సైకిల్ అతని తండ్రి జీవితంలో ఒక భాగం. దానితో జ్ఞాపకాలు అతనికి సుఖప్రదం! ఆ సుఖాన్ని వదులుకో లేడు అతను.
చేతి లోని హెర్క్యూలస్ సైకిల్ బెల్ చూస్తూ సారధి అనుకున్నాడు " నాన్న… హెర్క్యూలెస్ "!!
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
( రా. శా. )
Comments
Post a Comment