ఆచారం లో ఒౌచిత్యం:
"అరేయ్ వ్యాసా... , రేపు సోమవారం నుండి మహళాయ పక్షాలట, అమ్మ చెప్పమంది. నాన్న పోయిన తిధి - ద్వాదశి. గుర్తు పెట్టుకొని వీలైతే ఆ తిధి నాడు, లేకపోతే ఆ పక్షం రోజుల్లో నీకు కుదిరిన ఏదో ఒకరోజు తర్పణాలు విడవమంది. మర్చిపోకు " అక్కాయ్ గొంతు ఫోన్లో అమెరికా నుండి.
అమ్మ తన దగ్గరే ఉంటోంది రెండు నెలలుగా. వెళ్ళే ముందు ఒకరోజు చెప్పింది - " దసరా శరన్నవరాత్రులకు ముందు మహళాయ పక్షం వస్తుంది, తప్పకుండా పితృ దేవతలకి తర్పణాలు వదలాలి. మర్చిపోకు."
ఈ పెద్దవాళ్ళకి పనేం ఉండదు, ఇట్లాంటివన్నీ గుర్తు పెట్టుకొని మరీ మన బుర్రలోకి వదులుతుంటారు. అది అయ్యేదాకా మనకు శాంతి ఉండదు, వాళ్ళకు నిద్దరుండదు! నా మస్తిష్కం లో చిన్న మూలుగు.
నిజమే! తను మర్చి పోయాడు. వెతికితే కారణాలు వరస కట్టి నుంచుంటాయ్ ! వాటిల్లో - వీటి మీద తన కంత నమ్మకం లేక పోవడం కూడా ఒకటిగా కనబడచ్చు! కొంత వరకు కారణం ప్రాముఖ్యత పూర్తిగా తెలియక, లేక సరైన లాజిక్ తెలియక. అంతే కాకుండా అన్నింటికీ ముందుగా అన్పించేది - అంత టైమ్ ఎక్కడుంది మనకి? అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు! అంతా పరుగు మయం!
"కానీ నాన్నకు మాత్రం టైమ్ ఎక్కడిది! ఆయన పెట్టలే ? ప్రతి సంవత్పరం తాతయ్యకి, బామ్మకి తద్దినాలు! ఆఫీసుకు ఒంటి పూట వెళ్ళి వచ్చే వాడు. సెలవు దొరక్కపోతే పర్మిషన్ పెట్టి అందరి భోజనాలయ్యాక మళ్ళీ వెళ్ళే వాడు. పైపెచ్చు మహళాయ పక్షాల్లో పితృదేవతలందరికీ తప్పని సరిగా రాజమండ్రి వెళ్ళి మరీ గోదావరి తీరం లో తర్పణాలు వదిలే వాడు. అమ్మ నన్ను ఉన్నచోటే వదలమంటోంది కదా, పాపం! " - నాలోని ప్రత్యర్ధి నాకు అడ్డుగా వచ్చి ఉపదేశం!
ఫోన్ లో కాంటాక్ట్స్ తెరిచి చూడ్డం మొదలు పెట్టా పురోహితులు దీక్షితులు గారి నెంబరు కోసం. దొరుకుతూనే డయల్ చేశా. నెంబరు బిజీ. మళ్ళీ రెండు సార్లు చేశా, మళ్ళీ బిజీ అనే వచ్చింది. పది నిముషాల తర్వాత దీక్షితులు గారి నుండే ఫోనువచ్చింది.
"ఎవరండీ ఈ నెంబరు? రెండు మూడు మిస్సుడు కాల్సు ఉన్నాయ్ " ఆయన విచారణ.
వివరం, విషయం రెండూ చెప్పుకున్నా.
దీక్షితులు గారు "మీరు చాలా ఆలస్యంగా అడుగు తున్నారు. నేనేంచేయలేను. అస్సలు తీరిక లేదు" నిక్కచ్చిగా చెప్పారు.
" పోనీ మీకు తెల్సి వేరెవరైనా చేయగల్గినా సరే. ప్రయత్నించండి" నా గొంతు బ్రతిమిలాట!
" ఈ పక్షం రోజులూ ఎవర్నీ కదిలించలేం. ముందే మాట్లాడేసి పెట్టుకుంటారు. మీరు చెప్పిన ద్వాదశి తిధి మరీన్నూ! భోక్తలు దొరుకుతారేమో గానీ మంత్రం చెప్పే వాళ్ళు దొరకరు!".
మళ్ళీ ఆయనే " పోనీ సంకల్ఫం చెప్పుకొని స్వయంపాకం ఇచ్చేయండి, నేనే వచ్చి ఏదో ఒక టైమ్ లో జరిపించేస్తాను" అన్నారు.
"లేదండీ… పిండ ప్రదానంతో చేసుకోవాలనే. మీరే ఏదైనా మార్గం చూడాలి" నన్ను నేను తిట్టుకుంటున్న నా గొంతులో జీర!
" కొత్తగా ఇట్లాంటివే చేయించే సేవా సంస్థ ఒకటి వచ్చింది మన పేటలో. వాళ్ళ దగ్గర కనుక్కోండి. వాళ్ళ దగ్గర అవకాశం ఉంటే అదృష్టం" అంటూ దీక్షితులు గారు ఆ సంస్థ అడ్రసు, ఫోను నెంబరు ఇచ్చారు.
వెంటనే ఆ సంస్ఠకి ఫోను, వాళ్ళు లేదనడం,నేను ప్రాధేయపడడం ఒకదాని తర్వాత ఒకటి సాగినయ్ ."మేము ప్రొద్దున పది గంటలకి ఒకటి, మధ్యాహ్న్నం ఒంటి గంటకి ఒకటి షిఫ్టు కింద చేయిస్తూంటాం. ఇప్పుడు మీకోసం మూడో డ్యూటీ వేయాలి ఎవరికైనా. భోక్తలు దొరకడం కూడా కష్టమే! సరే మీరు ఇక్కడకు వస్తే చూద్దాం, కుదురుతే డబ్బు కట్టి వెళ్దురుగాని" సంస్థ చెప్పింది.
ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆ సేవాసంస్థ ని చేరుకున్నా.
"మీకోసం ఓ శర్మగారిని వప్పించాను మూడో పర్యాయం మంత్రం చెప్పడానికి. భోక్తలే కష్టంగా ఉంది. ఏమైనా చేయాలి". సంస్ఠ మేనేజరు చేసిన సహాయం మర్చిపోలేనిది! తిధి, వారం సరిగా నోట్ చేయించి డబ్బులు కట్టేశాను.
మళ్ళీ మేనేజరే " మా దగ్గరే ఒకాయన ఉన్నారు. కానీ వంట్లో బాగోక ఆయన భోక్తగా రావడం లేదు. కనుక్కుంటా నుండండి" అని "జగ్గన్నా… జగ్గన్నా" అని పిలుస్తూ వేరే గదిలోకి వెళ్ళాడు.
కొద్ది సేపటికి వచ్చి " మీ అదృష్టం ! ఆయన పథ్యం రెండు రోజుల్లో ముగుస్తుందట. ఆయన భోక్తగా కుదిరినట్లే. అప్పటికి ఇంకోళ్ళని కూడా చూడచ్చు లేండీ. తిధి కి ముందు రోజు వచ్చి మడికి ఆరేయాల్సిన బట్టలు ఇచ్చి వెళ్ళండి" అని ముగించాడు.
స్థిమిత పడిన మనసుతో ఇంటికి చేరి, అక్కయ్యకి ఫోన్ చేసి తనతో, అమ్మతో చెప్పేశా జరిగినదంతా.
******
నిర్ణయించుకొన్న రోజు రానే వచ్చింది. ప్రక్రియ మొదలైయ్యే ముందు మేనేజరు శర్మగారినీ, భోక్తలని చూపించి "వారి వెంట వెళ్ళండి" అని చెప్పి, "జగ్గన్నా వీరిని ఆ గదికి తీసుకెళ్ళండి" అన్నాడు! ఆ జగ్గన్న వయసు డెభై దాకా ఉండచ్చు , ఇంచు మించు నాన్న వయసే. తల వెంట్రుకలు, తెల్లని గెడ్డం బాగా పెరిగి ఉన్నయ్ ,, రెండు ప్రక్క దంతాలు ఊడినట్లు సొట్ట పడ్డ బుగ్గ చెబుతోంది.
"మీ గోత్ర నామాలూ, తండ్రిగారిది, తాత ముత్తాతలవి పేర్లు వ్రాసివ్వండి ఈ కాయితం మీద. పదే పదే చెప్పాల్సి ఉంటుంది కదా" శర్మగారి ఆదేశం.
వ్రాసి ఇచ్చినది చూస్తూ " ఆత్రేయశ గోత్రమా…" అంటూ ఆ కాగితం ప్రక్కన పెట్టి భోక్తలు ఇద్దర్నీ చూపించి " ఆయన శివరావు దేవ బ్రాహ్మడు, ఈన జగ్గన్నగారు పితృబ్రాహ్మడు "పరిచయం చేశారు శర్మగారు.
నేను వెళ్ళి బావి దగ్గర నీళ్ళు తోడుకొని మీద గుమ్మరించు కొని వచ్చి మడి బట్టలు కట్టుకుంటుంటే మేనేజర్ దగ్గరకొచ్చి " మీరు ఎవరికీ ఎటువంటి సంభావనా ఇవ్వక్కర్లేదు. అదంతా మీరు కట్టిన దాన్లోనే ఉంటుంది. వాళ్ళు అడక్కూడదు… అడగరు కూడా " చెప్పి వెళ్ళాడు.
నేను మడి బట్టలు కట్టుకొని లోపలికి వెళ్ళగానే శర్మగారు ప్రక్రియ ఉపక్రమించారు.
కొద్దిసేపటికే మా తండ్రి, తాత, ముత్తాతల పేర్లు ఉఛ్ఛరిస్తూ నాచేత కార్యక్రమం నడిపిస్తున్నారు శర్మగారు.
" ముందుగా దైవ బ్రాహ్మడికి కూర్చతో చేతిలో కొట్టి బియ్యం ఆయన శిరస్సు మీద వేసి, ఒక దర్భ ఆయన చేతి కిచ్చి నమస్కరించండి".
అలాగే చేశాను.
"ఆయన దైవస్వరూపులు మీకు. మీ కార్యక్రమానికి విచ్చేసిన దేవతా ప్రతినిధి అన్నమాట" వివరం చెప్పి, "ఇప్పుడు ఈ పితృ బ్రాహ్మడికి చేతిలో కూర్చ కొట్టి, తల మీద నువ్వులు చల్లి, ఒక దర్భ చేతికివ్వండి మీ తండ్రిగారి రూపం తలుచుకుంటూ. ఆయన మీ తండ్రి గారన్నమాట! మీ శ్రాద్ద భోజనం అందుకో డానికి వచ్చారు" అన్నారు శర్మ గారు జగ్గన్న గార్ని చూపించి.
నేను కూర్ఛకొట్టుకొని ఆయన చేతికి వేసి, తల మీద నువ్వులు వేసి చేతికి దర్భ పుల్ల ఇచ్చి, మా నాన్న రూపాన్ని కళ్ళు మూసుకొని తలచుకున్నాను.
ఆయన నా చేతిని వదల్లేదు. ఆయన కళ్ళు అశ్రుధారలు! వాటిని ఎడంచేత్తో తుడుచు కుంటున్నారాయన. ఏం జరిగిందో నాకు తెలియలేదు.
" జగ్గన్నా! ఏమైంది" శర్మ గారు ఆందోళనగా అడిగారు. ఆయన నా చేయి విడిచి, కొద్ది సెకన్ల రోదన తర్వాత తమాయించుకొని "ఫర్లేదు… మీరు కానివ్వండి" అనడంతో శర్మగారు మళ్ళీ మంత్రాలు అందుకున్నారు.
కాసేపటికి భోక్తల భోజనాలు… జగ్గన్న గారు కావల్సినవి మళ్ళీ మళ్ళీ అడిగి వడ్డించుకు తిన్నారు. అది మాకు చాలా సంతృప్తి నిచ్చింది.
తర్వాత పిండ ప్రదానం, కాకి పిండం / ముద్ద, శుద్ధి ఒకదాని తర్వాత ఒకటి అయి, శర్మగారు భోజనం చేయననడంతో, ముగ్గురు బ్రాహ్మణులకీ నమస్కరించి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం పుచ్చుకొని మేం భోజనాలు కానిచ్చాం.
ఇంటికి బయల్దేరే ముందు జగ్గన్న గార్ని కలిసి ఆయన ఎందు కంత ఎమోషనల్ అయ్యారో తెల్సుకోవాలనుకున్నాను. మేనేజర్ కి చెప్పాను ఆయన్ని కలవాలని.
"దూరం నుండి మిమ్మల్నే చూస్తున్నారు ఆ భార్యాభర్తలు… అరుగో " నాతో అని "జగ్గన్నా నీతో మాట్లాడాలట.. ఇట్రా" అంటూ అరిచాడు.
నవ్వుతూ మాకు దగ్గరవుతున్న ఆమెను పోల్చుకున్నాను. మా లెక్కల మాష్టారు జగన్నాధం గారి భార్య. మరి ఆయన? జ గ్గ న్న? ఒక్కసారిగా పొంగింది దుఃఖం. చాలా కాలం తర్వాత చూడ్డం, రూపంలో మార్పు వల్ల గుర్తు పట్టలేక పోయాను. నా కళ్ళనిండా నీళ్ళతో మాష్టారి రూపం తెలియడం లేదు. మాష్టారి చేతుల్లో, తర్వాత ఆయన పాదాల మీద నా ముఖం దాచుకున్నాను. నా అశ్రువులు ఆయన పాదాల్ని తడిపేస్తున్నాయ్ !
ప్రక్క నే ఉన్న నాభార్య కీ, మేనేజర్ కీ ఏం జరుగుతోందో బోధ పడలేదు. మాష్టారు, పిన్నిగారూ నన్ను లేపి కౌగిలించుకున్నారు. అప్పుడు అర్ధమైంది నాకు - ఆయన తల మీద నువ్వులు చల్లి, చేతికి దర్భ ఇచ్చినప్పుడు నా చేయి పట్టుకొని ఎందుకు రోదించారో! అంటే ఆయన మా గోత్ర నామాలు తెలియడం వల్ల నన్ను ముందే గుర్తు పట్టారన్న మాట! మా నాన్న రూపంలో ఎదురు పడాల్సి రావడంతో ఉద్వేగానికి లోనయ్యారన్న మాట!
వారిద్దరికీ నా భార్యని పరిచయం చేశాను. తనూ వాళ్ళకి పాదాభివందనం చేసింది.
వాళ్ళు ముగ్గురూ మాటల్లో ఉండగా నేను మేనేజర్ దగ్గరకు నడిచి " ఆయన ఎవరో తెల్సా? మీరనుకుంటున్నట్లు ఏ కుమ్మాయ్ , జగ్గాయ్ నో కాదు! ఆయన గొప్ప మాథమాటిక్స్ టీచర్ , పేరు జగన్నాధం గారు. ఆయన వల్ల మా స్కూలుకి జిల్లా మొత్తంలో పేరొచ్చింది! ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ మాథమేటిక్స్ పరీక్షలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత, కనీసం ముఫ్ఫై శాతం మందికి నూటికి నూరు మార్కులు! ఆ మాష్టారి పునాది వల్లే మాలో ఎంతో మంది పెద్ద చదువులు చదవగలగడం, పెద్ద ఉద్యోగాలు తెచ్చు కోవడం జరిగింది. అట్లా లబ్ధి పొందిన వాళ్ళల్లో నేనూ ఒకణ్ని. విధి వక్రించి ఆయన ఇక్కడ చేరి ఉండచ్చు. దయచేసి మీరు ఆయన్ని అలా పిలవడం మానేయండి. ఆయన వయసుకు, వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వండి" అనడం పూర్తి అవుతూనే, మేనేజర్ వెళ్ళి మాష్టారి చేతులు పట్టుకుని క్షమించమని ప్రాధేయ పడసాగాడు.
మేము మరి కొద్దిసేపు అక్కడే కూర్చుని వాళ్ళతో మాటలు సాగించి దసరా రోజుల్లో మాయింటికి వచ్చేట్లుగా ఒప్పించు కొని ఇంటి ముఖం పట్టాం.
*******
ఇంటికి వచ్చాక ఫేస్ బుక్ పోస్ట్ పెట్టా --
ఆచార వ్యవహారాలని తప్పించుకోడానికి కుంటి సాకులు వెతికే నా వంటి త్రిశంకు తరాల వాళ్ళకి సమాధానం దొరికింది.
ఈ సంప్రదాయాలూ, ఆచారాలూ ఇప్పుడు అనవసరం, కష్టం అన్పిస్తున్నా, వాటిని పెట్టడంలో ఉన్న ఒౌచిత్యం, ఆచరించడంలో ఉన్న ఒౌదార్యం ఎప్పటికీ అవసరమైనవే!
కొందరు సాటి మానవుల జీవనమే వాటి మీదే ఆధారపడి ఉంది.
ధర్మ మార్గం లో ఉపాధి కల్పించే ఏ ఆచార వ్యవహారాలైనా మంచివే.
వాటిని ఆదరిద్దాం - అవి మనలో ఎవరినైనా ఆదరించడానికి ఉపయోగ పడ్తాయ్ !
పది మందికి జీవనోపాధి అయ్యే ప్రక్రియ దేనికైనా కాలదోషం ఎందుకు పట్టాలి!!
( రా. శా. )
*********ఆ
Comments
Post a Comment