ఋణాను బంధరూపేనా…..
ప్రహ్లాద్ తన వయసు ఇరవైల్లో ఉన్నప్పడే అరుదైన అవకాశం రావడంతో అమెరికా వెళ్ళిపోయాడు. గత నలభై ఏళ్ళుగా అక్కడ పేరూ, డబ్బూ బాగా సంపాదించాడు. పిల్లలు కూడా అక్కడే స్థిరపడ్డారు.
ఒకానొక శుభముహూర్తాన కలిగిన ఆలోచనతో మాతృభూమి ఋణం తీర్చుకోవాలని తనూ భార్యా తిరిగి వచ్చశారు సొంత ఊరు విశాఖపట్నానికి.
రాగానే తన చిన్ననాటి స్నేహితుడు మురళి గురించి వాకబు చేసాడు. అతని అడ్రసు సంపాదించి వెళ్ళాడు అతను ఉండే చోటుకి.
అది ఒక వృద్ధాశ్రమం. ప్రహ్లాద్ ని చూసి మురళి బావురుమన్నాడు.
మాటల్లో మురళి భార్య మూడేళ్ళ క్రితం చనిపోయినట్లు, కొడుక్కి ఏ ఉద్యోగం రాకపోతూంటే తను అనారోగ్యం కారణం చూపించి కొడుక్కి తన ఉద్యోగం ఇప్పించుకున్నట్టు, తనని చూసుకోడం కొడుకూ కోడలికి అదనపు బాధ్యత అవడంతో దాన్నుంచి బయటపడడానికి స్వచ్ఛందంగా వృద్ధాశ్రమం తలుపులు తట్టినట్టు తెలిసింది ప్రహ్లాద్ కి.
చాలాసేపు అక్కడే అతనితో గడిపి తిరిగి తన ఇంటికి బయల్దేరాడు ప్రహ్లాద్ .
******
ఇంటి కొచ్చాక భార్యతో తన చిన్ననాటి రోజులు పంచుకున్నాడు ప్రహ్లాద్ . నేనూ మురళీ ఒకే స్కూలూ, తర్వాత ఒకే కాలేజీ లో చదువుకున్నాం. మురళి చదువులో అంత చురుకు కాకపోవడంంతో చదువులో వెనక పడడం, పరీక్షల ముందు నాతో కలిసి వాళ్ళింట్లో చదువు సాగించడం వల్ల గట్టెక్కుతుండేవాడు ఏ ఏటికాయేడు.
మురళి వాళ్ళమ్మ నన్ను వాడితో సమానంగా చూసుకునేది. నా స్నేహంలో వాడు మంచి నడతలో ఉంటాడని ఆమె నమ్మింది. తల్లి లేని నాకు ఆమెలో నా తల్లి కనపడేది. దానికి తోడు మా పేదరికం. మా ఇద్దరికీ పాఠ్యపుస్తకాలు ఆమే కొనేది. వారంలో మూడు నాల్గు రోజులు వాళ్ళింట్లోనే భోజనం.
నాకింకా గుర్తు - ఆమె, నేనూ, మురళి ఇంటర్మీడియట్ సీటు ఫలితాల నాడు ఒకే రిక్షాలో కాలేజీకి వెళ్ళాం. నాకు సీటొచ్చింది. వాడికి మార్కులు తక్కువొచ్చాయని ఫస్ట్ లిస్ట్ లో సీటు ఇవ్వలేదు. రెండో లిస్టులో వస్తుందని చెప్పారు. అమ్మ ఇద్దరికీ మొదటి టెరమ్ కోసం తెచ్చిన డబ్బులు, నా సంవత్సరం మొత్తం చదువుకు అయ్యే ఫీస్ కోసం కట్టేసింది. ఆమె దొడ్డ మనసేంటో చెప్పడడానికి ఇదో చిన్న ఉదాహరణ.
పళ్ళెంలో అన్నం వడ్డించి భోజనానికి పిలిచేది. తినబోయే ముందు తప్పకుండా అడిగి నాచేత రెండు మూడు పద్యాలు పాడించుకునేది. భాగవతం లోవి, దాశరధీ శతకం లోవీ రాగ యుక్తంగా నేను పాడుతుంటే అమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు జారేవి! ఆమె కోసం నేను మరింత ఇష్టంగా పాడే వాడిని. అదే నేను ఆ అమ్మ కిచ్చిన దక్షిణ ఆమె చూపిన అనురాగానికి.
మురళితో పరిచయం నాకు జీవితంలో ఒక స్నేహితుణ్ణే కాదు, మాతృప్రేమను కూడా ఇచ్చింది.
ఇంటర్మీడియట్ తర్వాత వాడు బీకామ్ లో నేను ఇంజనీరింగ్ లో చేరాం! ఆ రోజుల్లో కలిసి చదువు కోలేదు కానీ కలిసి తిరగడం మానలేదు.
తర్వాత నేను స్కాలర్ షిప్ రావడంతో ఎమ్మెస్ కోసం అమెరికా వచ్చేశాను.
తర్వాత వాడికి వాళ్ళ నాన్న రాష్ట్రప్రభుత్వ ఉద్యోగం తెప్పించుకున్నాడు.
వాడి పెళ్ళికి మాత్రం నేను వచ్చాను. నా ఉన్నతిని తెల్సుకొని అమ్మ ఎంత సంతోషించిందో! అమ్మ పోయినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత్తర్వాత ఎవరి జీవితం వాళ్ళదైపోయింది.
ఈ రోజున వాడు ఇలా ఉండడం నాకు చాలా బాధగా ఉంది” ప్రహ్లాద్ గొంతు గద్గదమయింది.
“బాధ పడకండి. ఈ పరిస్థితిని వాళ్ళ ఋణం తీర్చుకొనే అవకాశం గా మలుచు కుందురుగాని” అనునయంగా అంది ప్రహ్లాద్ భార్య.
******
ఎప్పటిలాగే నెల మొదటి ఆదివారం మురళిని కలవడానికి అతని కొడుకు హరి వచ్చాడు ఆశ్రమానికి. అతడు వచ్చిన ప్రతిసారీ మురళీ అతనికి ఒక చెక్కు ఇచ్చేవాడు. తన పెన్షన్ లో వృద్ధాశ్రమానికి పోగా మిగిలి మొత్తానికి ఆ చెక్కు వ్రాయబడేది.
ఆఫీసు సోఫాలో తండ్రి కోసం వేచి ఉన్న హరి దగ్గరకి ఆశ్రమం మేనేజర్ వచ్చాడు.
“ మా నాన్న కోసం వచ్చాను” చెప్పాడు హరి.
“ మూడు రోజుల క్రితం మీ నాన్నగారు ఆశ్రమం ఖాళీ చేశారు” చెప్పాడు మేనేజర్ .
“ అదేంటి! ఎక్కడికెళ్ళారు? మీకు చెప్పలేదా?” దాదాపు అరిచినట్లు అన్నాడు హరి.
“ ఆయన చిన్నప్పటి స్నేహితుడు ఎవరో ప్రహ్లాద్ ట. ఆయన వచ్చి తీసికెళ్ళారు. మీరు వస్తే ఇది ఇమ్మన్నారు మీ నాన్న గారు” అని ఒక కవర్ ఇచ్చాడు మేనేజర్ . తెరిచి చూశాడు హరి. తనకి నెల నెలా వచ్చే పెన్షన్ లోంచి ఇచ్చే డబ్బు తాలూకు చెక్కులు, ముందు తేదీలు వేసి మురళి సంతకం తో ఉన్నాయ్ !
*******************@@@*****************
( రా. శా.)
Comments
Post a Comment