Skip to main content

MMTS కధలు: పెర్ ఫార్మెన్స్ అప్రైజల్

MMTS కధలు: పెర్ ఫార్మెన్స్ అప్రైజల్


నేను చందానగర్ లో ఎక్కిన MMTS బండి వచ్చి హఫీజ్ పేట్ స్టేషన్ లో ఆగింది. బిలబిల మంటూ జనం లోపలికి ఎక్కడానికి తొందర పడుతున్నారు. ఎంట్రన్స్ దగ్గరే నిలబడి ఉన్న స్టూడెంట్స్ ప్రక్కకి జరిగి దోవ ఇస్తున్నారు తప్ప అక్కడి నుంచి లోపలికి రావడం లేదు. ఎక్కేవాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వయసులో ఉన్నవాళ్ళు గబగబ ఎక్కేసి సీట్లు ఆక్రమించుకుంటున్నారు.

కిటికీ ప్రక్కనే కూర్చున్న నా దృష్టి, బండి గబగబ ఎక్కడానికి వస్తున్న ఒక పెద్దాయన మీద నిలిచింది. రెండు చేతుల్లోనూ రెండు సంచులు ఉన్నాయి. వెనకాలే ఒక నడి వయస్కురాలు సూట్ కేసు లాగుతూ వస్తూ, “ ముందు మీరెక్కండి మామయ్యా. నేనిది లోపలకి ఎక్కిస్తాను” అంటోంది.

బండి నిముషం కూడా ఆగదు, ఎక్కగలడా! అనుకుంటున్నాను. వడివడిగా నడుచుకుంటూ వచ్చి ఆయన ఎక్కాడు. వెనకాలే ఆమె పరుగున వచ్చి కదలడం మొదలైన బండిలోకి ఎక్కించి “ జాగ్రత్తగా దిగండి మామయ్యగారూ. చాలాసేపు ఆగుతుంది స్టేషన్ లో. అవసరమైతే కూలీ పెట్టుకోండి తొందర పడకండి దిగేటప్పుడు”
కదులుతున్న బండి తోనే నడుస్తూ చెప్పింది.

పెద్దాయనికి ఎంత వినపడిందో నాకు అర్దంకాలేదు. ఆయన్ని చూస్తుంటే “బండి ఎక్కగలనా?” అన్న టెన్షన్ నుండి బయటపడినట్లు లేడు.

ఆయన అవస్థ చూసి నా ప్రక్క ఖాళీగా ఉన్న సీటు ఆయన కోసం ఆపి, “రండి సార్ మీకు ఇక్కడ సీటు ఉంది” అని చెప్పాను.
ఆయన మూడు సామాన్లూ మెల్లగా సీటు దగ్గరకు లాక్కోని కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని కొంచెం రొప్పుతో వగరుస్తున్నాడు.

“ కాసిని నీళ్ళు తాగండి “ అంటూ నా వాటర్ బాటిల్ అందించాను.
“ వద్దు, ఉన్నయ్ బాబూ నాతో” అంటూ సంచి లో వెతికి బాటిల్ బయటకి తీసి కొంచెం త్రాగి మళ్ళీ లోపల పెట్టేశాడు.

ఆయన రొప్పు తీరే వరకు నేను మాట్లాడించద్దు అనుకున్నాను. తీరిన తర్వాత ఆయనే మాట కలిపాడు.
“ ఆ అమ్మాయి నా కోడలు, లెక్చరర్ . పిల్లల్ని స్కూలు దగ్గర దింపి రావడం లో ఆలస్యం అయింది. హడావిడి పడ్డా, మొత్తానికి ఎక్కించ గలిగింది”

“ మీ అబ్బాయి రాలేక పోయారా?” అనవసరపు ప్రశ్న ఒకటి నానుంచి.
ఎవరైనా రాగలిగితే వస్తారుకదా!

“ వాడి ఆఫీసు లో చాలా ముఖ్యమైన పని ఉండి వాడు రాలేక భార్యని దింపమన్నాడు” పెద్దాయన సమాధానం.

మా యిద్దరి మధ్య కాసేపు మౌనం. నేను సెల్ తీసి చూడబోతుంటే ఆయనే అన్నాడు మళ్ళీ “ మీరు ఎక్కడిదాకా వెళ్ళాలి?”
“నెక్లేస్ రోడ్ . నా ఆఫీసు సోమాజీగూడా లో, నెక్లేస్ రోడ్ స్టేషన్ నుంచి అయిదు నిముషాల నడక” చెప్పాను.
“నెక్లే స్ రోడ్డు ఎప్పుడొస్తుంది? సికింద్రాబాద్ కంటే ముందా తర్వాత నా?”
“ ముందూ కాదూ, తర్వాతా కాదు, వేరే లైన్ లో వస్తుంది”.
“ఎందుకు అడిగారూ!” నేనే పొడిగించాను సంభాషణ.
“ఏంలేదు. నేను సికింద్రాబాద్ వెళ్ళాలి. స్టేషన్ లో దిగే టప్పుడు వీలైతే మీ సహాయం తీసుకుందామని”అన్నాడు.

నాకు మెదడు పనిచేయడం ఒక్క క్షణం ఆగి పోయింది.

“ ఈన వెళ్ళాల్సింది సికింద్రాబాదు స్టేషన్ కా! మరి ఈ ట్రైన్ ఎందుకు ఎక్కాడు? ఇది వెళ్ళదుకదా! ఇప్పుడేం చేయాలి ! చెప్పాలా వద్దా ?” నా ఆలోచనలు MMTS బండి కంటే వేగంగా పరిగెడుతున్నాయ్ .

ఇంతలోనే మా సంభాషణలు వింటున్న ఎదురు సీటు కుర్రాడు “సార్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళదండి” అని అనేశాడు పెద్దాయనతో.

“ఆ! వెళ్ళదా? “ అంటూ సెల్ ఫోన్ తీసి ఫోన్ చేసి అవతలి వ్యక్తితో “ అమ్మాయ్ ఈ బండి సికింద్రాబాదు స్టేషకి వెళ్ళదట, మరిప్పుడేం చేయను?” అన్నాడు.

రెండు నిమిషాలు మాట్లాడాక, “మీతో మాట్లాడు తుందిట మా కోడలు” అంటూ సెల్ నాకు అందించాడు.

ఆమె దీనమైన మాటల సారంశం - తొందరలో ఆమె వల్ల పొరపాటు జరిగిందని, ఎలాగైనా నేను పరోపకారి పాపన్న పాత్ర పోషించి ఆ పెద్దాయనని సికింద్రాబాద్ స్టేషన్ చేరేలా చూడాలని.

ఈ బండి తర్వాత నాకు మళ్ళీ నలభై నిముషాల దాకా ఇంకో బండి లేదు. ఫస్ట్ అవర్ లోనే క్లైంట్ తో వీడియో  కాన్ఫరెన్సు లో రివ్యూ మీటింగ్ . మూడు రోజులనుండి ఆ మీటింగ్ కి కావలసిన సమాచారం సేకరించడం, రిపోర్ట్ , ఛార్ట్స్ తయారీ అంతా నేనే చూసుకున్నాను.
నేను లేక పోతే బాసు అగ్గిబుగ్గైయి పోతాడు.
పెద్దాయనకి ఎక్కడ దిగి ఎలా వెళ్ళాలో చెప్పేసి చెయ్యి దులుపుకుందాం అనుకున్నాను.

“మీరొక పని చేయచ్చు. బేగంపేట స్టేషన్ లో దిగి, అక్కడ నుండి ఆటోలో స్టేషన్ కి వెళ్ళచ్చు. లేదంటే కొద్ది సేపట్లో సికింద్రాబాద్ వెళ్ళే MMTS వస్తుంది, అది ఎక్కి సికింద్రాబాద్ వెళ్ళచ్చు.” నేను చెప్పడం పూర్తి చేయకుండా నే, ఆయన నా చెయ్యి పట్టుకొని “ బాబూ నేను ఈ ఉరికి కొత్త. దారి తెలియదు, ఆటోలు ఎక్కడం దిగడం చేయలేను. దయచేసి మీరే నాకు సహాయం చేయాలి” అంటున్న ఆయన చేతులు వణుకుతున్నయ్, అవి పట్టుకుని ఉన్న నా చేతులు ఊగు తుంటే నాకర్ధమైంది ఆయన ఎంత భయపడుతున్నాడో.

ఇంతలో బండి ఆగింది, బేగంపేట స్టేషన్ కంటే ముందే ఆగింది, అంటే అక్కడ ఏదో క్రాసింగ్ ఉండి ఉంటుంది. అలా ఆగిందంటే ఇంకో 15 లేదా 20 నిముషాలు ఇంక కదలదు.

ఆయన టిక్కెట్ అడిగి తీసుకొని చూశాను.
 ఇంకో గంటా పది నిముషాలల్లో ఆయన ట్రైన్ బయల్దేరుతుంది.

ఇంతలో ఆఫీసు నుంచి భానుమూర్తి ఫోను, “ఏంట్రా ఇంకా రాలేదు, బాసు ఇవాళ ముందే వచ్చేయమన్నాడు కదా” అంటూ.

తనకి నేనున్న పరిస్థితి అంతా క్లుప్తంగా చెప్పి, “రాత్రి వచ్చే ముందు రిపోర్ట్స్ అన్నీ ప్రింట్ తీసి బాసుడి టేబుల్ మీద ఉంచాను. ఇంకో కాపీ నా డ్రావర్లో ఉంచాను. సాఫ్ట్ కాపీ నా డెస్క్ టాప్ మీదే ఉంది కావాలంటే” అని చెప్పాను.

“ఈ రోజు బాసుడు మన పెర్ఫామెన్స్ అప్రైజల్స్ పంపిస్తానన్నాడు. రిస్క్ తీసుకోకు” అని సలహా ఇచ్చాడు భాను.

ప్రక్కన పెద్దాయనని చూస్తే జాలేస్తోంది. ఆయనలో మా నాన్న కనిపించాడు. మా నాన్నకే ఈ పరిస్థితి కలిగితే.  నా మనసు సామాజిక బాధ్యత వైపే మొగ్గింది.

అది పూర్తి చేసుకొని ఆఫీసుకు వెళ్ళే సరికి గంటన్నర ఆలస్యం, వీడియో కాన్ఫరెన్సు జరగలేదని ఊరటనిచ్చే వార్త. - తదుపరి బాసుడు నాకు ఆ రోజుకి ఆబ్సెంట్ మార్క్ చేయడం, నేను అక్కడే ఆఫీసులో లంచ్ అవర్ దాకా ఉండి కొంత పెండింగ్ పనులు చేసుకొని
సినిమా చూడటానికి వెళ్ళి పోవడం జరిగి పోయాయి.

రాత్రి కి ఫోన్ చేసి మూర్తి చెప్పిన విషయం - బాసుడు నా ఆఫీసుకు ఆలస్యంగా రావడం గురించి హెచ్ ఆర్ వాళ్ళకి చెప్పి నన్ను తన టీమ్ నుండి తప్పిం చేశాడు. నేనింక కొద్ది రోజులు బెంచ్ మీదే! సెల్ ఆపేసి త్వరగా పడుకుండి పోయాను.
***********
ప్రొద్దున్నే రెండు మిస్సుడ్ కాల్ మెసేజ్ లు -  ఒకటి బాసుడు నుండి, రెండోది ఏదొ క్రొత్త నంబరు. నేను తిరిగి చేయలేదు

ఆఫీసుకి ముందే వెళ్ళి హెచ్  ఆర్ వాళ్ళని కల్సాను. వారంలో ఏదైనా టీమ్ లో వేస్తామన్నారు.

వెళ్ళి కేంటిన్ లో కూర్చోని గప్పాలు కొడుతున్నాను ఇతర బెంచ్ మిత్రులతో.

ఒక గంట తర్వాత నాకు బాసుడు నుంచి ఫోను.
“ నాతో ఈన కింకేం పని? వదిలించు కున్నాడు గదా! తీయాలా వద్దా?” ఆలోచన. తీశాను. ఒకసారి ఆఫీసుకు రమ్మని పిలుపు. గొంతులో కాఠిన్యం లేదు, ఏదో తెలియని అభ్యర్ధనా పూర్వకంగా ఉంది స్వరం.

వెళ్ళాను బాసుడి క్యాబిన్ లోకి. కొలీగ్స్ అంతా అక్కడే ఉన్నారు. నేనే తప్పు చేయనందుకు నాలో భయంలేదు, కానీ ఎందుకు పిల్చినట్లు? అందరి ముందు అవమానించడానికా?

నన్ను చూసి మా బాసుడు లేచి నిలబడి “ కంగ్రాట్స్ ! యు ఆర్ పోస్టెడ్ యాజ్ టీమ్ హెడ్ ఆఫ్ అవర్ సి.యస్ .ఆర్ .” అంటూ బొకే నాకు అందించాడు.

కంపెనీ సామాజిక బాధ్యతల గ్రూప్ కి నేను లీడర్ - ఇదెలా జరిగింది? నిన్న ఉదయం ఛీత్కారం - ఈ ఉదయం పురస్కారం? హౌ! హౌ! నా మనసు సమాధానం వెతుకు తోంది.

ఉదయం వచ్చిన దగ్గర్నుండి ఆయన హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ వాళ్ళతో ఏదో మాట్లాడుతూనే ఉన్నాడట.
**********
నిన్న ఆ పెద్దాయన రైలెక్కిన తర్వాత ఆశీర్వదించి, నా ఫోన్ నెంబరు తీసుకోడం ఇంతకి దారి తీసింది. ఆయన తన కొడుక్కి నిన్న MMTS ప్రహసనం అంతా ఫోన్ చేసి చెప్పి, నా ఫోను దొరకక పోవడం వల్ల తను క్షేమంగా ఇంటికి చేరిన సంగతి నాకు చెప్పమని కొడుకును అడిగాడు.

ఆయన కొడుకే - మా బాసు!

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
( రా. శా. )

Comments

Popular posts from this blog

మృత్యువు కు చెక్

MMTS కధలు మృత్యువు కు చెక్ : చందానగర్ స్టేషన్ లో నేను ఎక్కాల్సిన MMTS బండి వచ్చి ఆగింది. టైమ్ చూసుకుంటూ బోగీ దగ్గరకి నడిచాను. బండి పావుగంట ఆలస్యం. ఇంకెక్కడా ఆలస్యం అవకుండా బండి నడిస్తే ఆఫీసుకు అయిదు నిముషాలు ముందు చేరుకుంటాను. లేదంటే బాసు పెట్టే నోటి వాతలకి సిద్దంగా ఉండాలి. అవును మరి, రచయిత జంధ్యాల గారికి కూడా తట్టని తిట్లు తిట్టగలడు మా బాసు. అంత కొత్తగా వేడిగా పడేవి మరి నోటి వాతలే కదా!  శరీరం మీది మామూలు వాతలైతే అంగీతోనో, పాంటు తోనో దాచుకోవచ్చు. కానీమా బాసు పెట్టే సెటైరిక్ శాడిస్టు నోటివాతలు, రెండు బదిలీల మీద రెండు ఆఫీసులు మారినా మర్చిపోలేం! బోగిలోకి ఎక్కి చక్రవర్తి కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడా? అని. కన్పడలేదు. చక్రవర్తి MMTS బయల్దేరే స్టేషన్ లింగంపల్లిలో ఎక్కుతాడు. తనప్రక్క సీటు నా కోసం ఆపి ఉంచుతాడు. ఇద్దరం ఒకే ఆఫీసు అవడంతో మా MMTS పయనం రోజూ మూడు యధార్ధాలు, ఆరు పుకారుల కబుర్లతో నడిచి పోతోంది. ఎప్పుడైనా ఎవ్వరం సెలవు పెడుతున్నా రెండో వాళ్ళకి చెప్పుకుంటాం. “ ఈ రోజు ఏమైంది తనకి” అనుకుంటూ ఖాళీగా కనబడ్డ సీటులోకి శరీరాన్ని చేర్చాను. “మీ బెటర్ హాఫ్ ఏడి సర్ , కనబడ్డం లేదు?” -...

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష! పదేళ్ళ క్రితం: "ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ . "మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి. ****** తొమ్మిదేళ్ళ క్రితం: " ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో. " అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి. ****** ఎనిమిదేళ్ళ క్రితం: "ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున. " అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు. ****** ఏడేళ్...
కిర్  కిర్   తలపులు నియమం: వ్రతాలు, రోజాలు, సువార్త కూటములు - ఆన్నింటిలో వ్యాపకం ఒకటే భజించడం .... దాగిఉందొక మూల వ్యాపకం తదుపరి భుజించడం