Skip to main content

మీ వల్ల అవదు లేండీ

మీ వల్ల అవదులేండీ”


రమణ పదవీ విరమణ అయ్యాడు.

ఇన్నాళ్ళూ తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న భార్య లలిత కి ఇంటి పనుల్లో సహాయ పడుతూ తనకా పనిభారం తగ్గించాలనుకున్నాడు.

అదే మాట తనతో చెప్పాడు “రేపట్నుంచి ఇంటి పనుల్లో సింహభాగం నేనే చేస్తానోయ్ . నువ్వుఒక్క వంటపని చూసుకుంటే చాలు”.

అన్నాడే కానీ లలిత లాగా చేయడం తనవల్ల అవుతుందా - అనుకున్నాడు. సింహభాగం పక్కనుంచి సగం చేయ గలిగినా చాలనుకున్నాడు

లలిత ఉదయం అయిదు గంటలకల్లా లేచేస్తుంది.

ఎప్పుడు చేస్తుందో, ఎలా ప్లాన్ చేసుకుంటుందో, అన్ని పనులు ఒక్కర్తి చేసుకుంటూ అలసటన్నది మొహంమీద కనపడనీయకుండా,  పెద్దవాళ్ళ దగ్గర్నుండి పిల్లల్దాకా  అందరికీ అన్నీ సమకూరుస్తుంది వాళ్ళ వాళ్ళ టైమ్ కి.

మధ్యలో  పది నిముషాల కాఫీ బ్రేక్ తప్పించి, మాజిక్ షో లో మెజీషియన్ మాదిరి ఒకదాని తర్వాత ఒకటి టకటక చేసేసుకు పోతుంటుంది.

ఆమె చేతులు దేనికోసం వెతుక్కోకుండా కావల్సిన పాత్రల దగ్గరకి వెళ్ళడం చూస్తూంటే పాత్రలే వాటంతట అవి ఆమె చేతి దగ్గర కొచ్చి “నేను... నేను ఇక్కడ...” అని పోటీగా  నిల్చుంటాయన్పిస్తుంది.


రేపటి నుండి తనకు పనులు తగ్గించాలన్న మాట గుర్తుకోస్తూనే తన పధకం గుర్తు కొచ్చింది రమణకి.

వెంటనే తెల్సిన మెడికల్ షాపుకెళ్ళి కావలసినది కొని ఇంటి ముఖం పట్టాడు.

-*-*-*-*-*-*-*-*


రాత్రిళ్ళు ఎక్కువ తినద్దు అనే నియమం అలవాటు చేసుకున్న తర్వాత ఎక్కువగా పండ్లరసం లేదా మజ్జిగ తాగడం అలవాటు ఇద్దరికి. ఎవరైనా చుట్టాలొస్తేతప్ప సాధారణంగా వంటన్నది పెట్టుకోవడం లేదు రాత్రిళ్ళు.

వంటగదిలో లలిత బత్తాయి రసం తీస్తూంటే, హాల్లో ఉన్న రమణ వచ్చి- “ ఉండు. నే తీస్తా రసం”- అన్నాడు.

“మీరు రేపటి నుండి కదా పనులు చేస్తానందీ?”  తల తిప్పకుండానే అంది లలిత.

“అవుననుకో! ఇది వార్మింగ్ అప్ అనుకో. అవిటిచ్చేసి నువ్వెళ్ళి నీకిష్టమైన వంటల సీరియల్ చూసుకో”  అంటూ లలితని బయటకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు.

నవ్వుకుంటూ TV చూడ్డంలో నిమగ్నమైంది లలిత.

మిగిలిన రెండు బత్తాయిలు కూడా కోసి రసం తీసి గ్లాసులు తెచ్చుకున్నాడు పోయడానికి.

రసం గ్లాసుల్లోకి ఒంపబోతూ హాల్లోకి చూసాడు.


హాచ్చెర్యం..


లలిత సీరియల్ చూడట్లేదు.

అక్కడనుంచి తననే చూస్తోంది నవ్వుతూ.

“నన్ను చూడడం ఆపి TV  చూసుకో. భయపడకు బాగనే కలుపుతాను” వంటింట్లోంచే అరిచాడు రమణ.

లలిత TV చూడ్డంలో పడిపోయిందని చూసుకున్నాక, మెల్లగా ఇందాక మెడికల్ షాపులో కొన్న నిద్రమాత్రల్లో ఒకటి తీసి లలితకి ఇవ్వబోయే గ్లాసులో వేసి అందులో సగం వరకూ రసం పోసి తిప్పాడు.


రమణకి పొద్దున్నే లేచే అలవాటు లేదు. లలితకి ఉదయం అయిదు దాటిందంటే పడుకునే అలవాటు లేదు. లలిత కంటే తను ముందు లేవలేడు కనుక లలిత ఎక్కువసేపు పడుకోనేలా చేసి తనులేచే లోపు చాలా పనులు చేసెయ్యాలని రమణ ప్లాన్.


మిగిలిన రసం గ్లాసుల్లో నింపబోతుంటే కాలింగ్ బెల్ మోగింది

లలిత లేచి తలుపు తీయగానే -- “ఏడి వీడు రవణ? IPL చూడ్డం లేదా?” అంటూ లోపలికొచ్చాడు పక్క ఫ్లాట్ లోనే ఉండే రమణ  అన్నయ్య.

“ఉన్నారు.మీరు కూర్చోండి” అంటూ ఛానల్ IPL కి మార్చి రమణ దగ్గరకొచ్చి “మీ అన్నయ్యగారొచ్చారు. నేను తెస్తా మీరు వెళ్ళండి. “ అంటూ లలిత వంటిట్లోకొచ్చింది.

“సరే నే వెళ్తాను గాని ఆ మిక్సీ పక్కనున్న గ్లాసులో రసం నువ్వు తీసుకో తప్పకుండా” అని చెప్పి వచ్చి  అన్నయ్య పక్కన కూర్చున్నాడు.

ఇద్దరూ మాచ్ చూడసాగారు.

కాసేపటికి లలిత ఇద్దరికీ  జ్యూస్ తెచ్చింది.

జ్యూస్ సిప్ చేసుకోంటూ అన్నదమ్ములిద్దరూ వార్నర్ బాదుడు (దాన్ని బ్యాటింగ్ అనలేంగా) ఆనందించసాగారు.

కాసేపటికి లలిత వంటిల్లంతా సర్దేసుకొచ్చి పక్కమీద వాలింది.

అలా పడుకుందో లేదో ఇలా నిద్ర పట్టేసింది తనకి.

రమణ మాత్రం వాళ్ళ అన్నయ్యతో కలిసి మాచ్ అంతా చూసి ఆయన వెళ్ళాక బెడ్ రూమ్ కొచ్చి వళ్ళు తెలియని నిద్రలో ఉన్న భార్యని చూసి నవ్వుకుంటూ, “రేపు నేనిచ్చేషాక్ కి తను ఎలా రియాక్టవుతుందో చూడాలి అనుకున్నాడు.

అలా నడుం వాల్చాడో లేదో ఇలా నిద్రపట్టేసింది రమణకి.

-*-*-*-*-*-*-*

ఎండ కిటికీలో నుండి కళ్ళ మీద పడడం, ఇంటి బయట వాహనాల శబ్దంతో నిద్ర నుండి మెలకువ వచ్చింది రమణకి.

Time చూసుకుంటే తొమ్మిది.

పక్కన చూసుకున్నాడు…. లలిత లేదు. వంటింట్లోంచి గిన్నెల చప్పుళ్ళు.

అంటే తన ప్లాన్ ఫ్లాప్ అయిందన్నమాట.

“ఎలా? ఎలా జరిగిందిది” అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి “ఎప్పుడు లేచావేంటి? నే చేయాల్సిన పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావ్ “ అడిగాడు.

“మామూలుగానే, అయిదింటికి”

“నీకు పిచ్చ పిచ్చగా మొద్దునిద్దర పట్టలేదా?” ఆశ్చర్యపడుతూ అడిగాడు రమణ.

“అట్లాంటిదేం లేదండి” కూల్ సమాధానం వచ్చింది అవతల్నుంచి.

ఎక్కడో పొరపాటు జరిగింది - తనలోతాను అనుకుంటూ, తెలివిగా “రాత్రి నే చేసిన జ్యూస్ ఎలా ఉందో చెప్పనేలేదు నువ్వు” అడిగాడు అసలు తాగిందోలేదో తెలుసుకోడానికి.

“ఆ కాస్త జ్యాసుని  ఎంతమందికి సర్దగలను? అందుకని నేను మజ్జిగ తాగాను, జ్యాసు మీకూ మీ అన్నయ్య గారికే వచ్చింది” లలిత సమాధానం.

“మరి నీకని ఉంచిన గ్లాసు ఎవరికిచ్చావ్ మాఇద్దర్లో?” ఆత్రంగా అడిగాడు రమణ.

“మీరు అంత ఇష్టంగా నాకోసమే పక్కన పెట్టినది ఆయనకెందుకిస్తాను? మీకే ఇచ్చాను” భార్య సమాధానం విన్న రమణ ముఖంలో నెత్తురు చుక్క లేదు.


అతనికి ఓ తెలుగు సామెత గుర్తుకొచ్చింది.


అద్దం ముందుకెళ్ళి నిలబడిన రమణతో అద్దంలో తనబింబం, అద్దంమీదే లలిత అంటించిన స్లిప్పు ఎక కంఠంతో “ మీ వల్ల కాదులేండి” అన్నట్లన్పించింది రమణకి.


                         &&&&&&

Comments

Popular posts from this blog

మృత్యువు కు చెక్

MMTS కధలు మృత్యువు కు చెక్ : చందానగర్ స్టేషన్ లో నేను ఎక్కాల్సిన MMTS బండి వచ్చి ఆగింది. టైమ్ చూసుకుంటూ బోగీ దగ్గరకి నడిచాను. బండి పావుగంట ఆలస్యం. ఇంకెక్కడా ఆలస్యం అవకుండా బండి నడిస్తే ఆఫీసుకు అయిదు నిముషాలు ముందు చేరుకుంటాను. లేదంటే బాసు పెట్టే నోటి వాతలకి సిద్దంగా ఉండాలి. అవును మరి, రచయిత జంధ్యాల గారికి కూడా తట్టని తిట్లు తిట్టగలడు మా బాసు. అంత కొత్తగా వేడిగా పడేవి మరి నోటి వాతలే కదా!  శరీరం మీది మామూలు వాతలైతే అంగీతోనో, పాంటు తోనో దాచుకోవచ్చు. కానీమా బాసు పెట్టే సెటైరిక్ శాడిస్టు నోటివాతలు, రెండు బదిలీల మీద రెండు ఆఫీసులు మారినా మర్చిపోలేం! బోగిలోకి ఎక్కి చక్రవర్తి కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడా? అని. కన్పడలేదు. చక్రవర్తి MMTS బయల్దేరే స్టేషన్ లింగంపల్లిలో ఎక్కుతాడు. తనప్రక్క సీటు నా కోసం ఆపి ఉంచుతాడు. ఇద్దరం ఒకే ఆఫీసు అవడంతో మా MMTS పయనం రోజూ మూడు యధార్ధాలు, ఆరు పుకారుల కబుర్లతో నడిచి పోతోంది. ఎప్పుడైనా ఎవ్వరం సెలవు పెడుతున్నా రెండో వాళ్ళకి చెప్పుకుంటాం. “ ఈ రోజు ఏమైంది తనకి” అనుకుంటూ ఖాళీగా కనబడ్డ సీటులోకి శరీరాన్ని చేర్చాను. “మీ బెటర్ హాఫ్ ఏడి సర్ , కనబడ్డం లేదు?” -...

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష! పదేళ్ళ క్రితం: "ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ . "మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి. ****** తొమ్మిదేళ్ళ క్రితం: " ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో. " అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి. ****** ఎనిమిదేళ్ళ క్రితం: "ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున. " అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు. ****** ఏడేళ్...
కిర్  కిర్   తలపులు నియమం: వ్రతాలు, రోజాలు, సువార్త కూటములు - ఆన్నింటిలో వ్యాపకం ఒకటే భజించడం .... దాగిఉందొక మూల వ్యాపకం తదుపరి భుజించడం