కన్య - కుమారి:
అమ్మ చెప్పింది….
మాట్లాడు
మగాళ్ళతో
వాళ్ళ మాటలు
“పక్క”దారి పట్టనంత వరకు
స్నేహ గుణం:
గడియారం కొట్టుకుంటోంది….
గుండేె కొట్టుకుంటోంది.
రెంటికీ ఒకటే స్నేహ గుణం -
చెప్పా పెట్టకుండా....
ఆగి పోవడం
ఆగిన చక్రం:
వాన ముందా?
చెట్టు ముందా?
వానొస్తే చెట్టు పెరుగుతుంది
చెట్టు పెరిగితే వానొస్తుంది
తిరిగే ఈ చక్రం మధ్యలో
గొడ్డలి ఎక్కడ నుంచొస్తోంది
పోరాటం:
“నిజం” కి ధైర్యం ఎక్కువ
ఎప్పుడూ
ఒంటరి పోరాటమే
“అబద్దం” పిరికిది
పదిమందిని
వెంటేసుకు తిరుగుతుంది
వేటగాళ్ళు:
మనిషి - ౘఋస్తున్నాడు తొడ
వలలో చిక్కుకున్న మృగాన్ని చూసి
దోమ - చేస్తోంది బల్లే.. బల్లే..
తెరలో దాక్కున్న మనిషిని చూసి
కనబడుట లేదు:
నా కవలలు
సంతోషం - సంతృప్తి
తప్పి పోయాయి
వెతకడం మొదలెట్టాను
కొండల్లో, కోనల్లో,
స్టార్ హోటళ్ళలో, రిసార్టుల్లో,
బజార్లలో, షాపింగ్ మాలుల్లో,
గుళ్ళల్లో, గోపురాల్లో
ప్రకటించాను
ఉన్నదంతా ఇచ్చేస్తానని
నా కవలల్ని నాకు తెచ్చిమ్మని
ఓ పెద్దమనిషి చెప్పాడు
చూసానని
నా వెంటే ఉన్నాయట
నా నీడగా ఉన్నాయట
నిజమా!
అందంగా లేనా:
ప్రేమించాను -
పసితనంలో - ఇంట్లో వాళ్ళందర్ని
చిన్నతనంలో - స్నేహితుల్ని
కౌమారంలో - గురువుల్ని
యవ్వనంలో - సహచరిని
సంసారంలో - సంతానాన్ని
వృత్తిలో - పనిని
వార్ఢక్యంలో - దేవుణ్ణి
నే వచ్చిన పని అయిపోయింది
చివరిగా…...
నన్ను నేను చూసుకోవాలని
అద్దం ముందు నిలుచున్నాను
నా బింబం అడిగింది దీనంగా -
నీకెప్పుడూ అన్పించ లేదెందుకు?
నన్ను ప్రేమించాలని.....
గాలింపు:
విదేశాల్లో సంతానం
నువ్వెగరేసిన గాలిపటం
ఎత్తులో ఎగురుతుంటే
ఘనంగా ఉంటుంది
గిరిటీలు కొడ్తూంటే
భయంగా ఉంటుంది
దానితో బంధం
సన్నని దారం
అది తిరిగొచ్చేది
దారం గట్టిదైనప్పుడే
బంధం బలంగా లేకపోతే
తెగిన పటాన్ని
తిరిగి తెచ్చుకోగలవా
జిహాదీలు:
మందుగుండు
తలను పెట్టుకు తిరిగే
అగ్గిపుల్ల చేసేదీ
మనసు కడుపులో దాచుకొని
కాపురం చేసే
ఆడపిల్ల చేసేదీ
ఆత్మాహుతి దాడులే
రిటర్న్ గిఫ్ట్ :
రాజకీయాల్లో
చేరినోడి ఇల్లాలికి
ఏడు వారాల
నగలు
సైన్యంలో
చేరినోడి ఇల్లాలికి
ఏడు రంగుల
తెల్ల చీర
మీకు మీరే మాకు మేమే:
విడి విడిగా నిప్పు రవ్వలు
ఒక్కటైతే అగ్నికీలలు
విడి విడిగా కొమ్మలు
ఒక్కటై మహావృక్షం
విడి విడిగా బిందువులు
కలిసి మహాసంద్రం
విడి విడిగా మనుష్యులు
కలిస్తేగా… మానవత్వం
ఆకలి రాజ్యం:
కడుపు నిండి నోడి
మనససంతా
కళా పోషణ మీదే
కడుపు కాలే వాడిి
మెదడంతా
ఉదర పోషణ మీదే
ఇద్డర్లో చిన్న తేడా -
నిండి
నిండక
పోవడమే
గుణం:
పది మందికి
ఉపయోగపడడం
వేడుక
పది మందిని
ఉపయోగించుకోడం
వాడుక
సంబంధీకులు:
పైన
పల్లకిలో ఉన్న వాడికి
కడుపు కాలదు
క్రింద
పల్లకి మోసే వాడికి
కడుపు నిండదు
ఇద్దరిదీ
శారీరక సంబంధం
ఒకళ్ళది
సుఖ పడ్తుంది
ఇంకోళ్ళది
కష్ట పడుతుంది
ఇది
అక్రమసంబంధమా
సక్రమ సంబంధమా
కాలం తేల్చలేదు
ఇప్పటి వరకు
ఈ బంధం
తెగనంత వరకూ
తప్పవు -
“పల్లకీ మోతలు”
శిధిలం - పదిలం:
జబ్బు చేసి నోడికి
ప్రభుత్వ ఆసుపత్రి
డబ్బు చేసి నోడికి
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
మొదటి దాని
గోడలు
కూలు తున్నయ్
రెండో దాని
అంతస్తులు
పెరుగుతున్నయ్
ధృతరాష్ట్ర కౌగిలి:
సమస్యలు
మనుష్యుల్ని
కౌగిలించు కుంటాయి
సమస్యలున్న మనుష్యుల్ని
బాబాలు
కౌగిలించు కుంటారు
సమస్యలు
బాబాలు
మోసాలు
కుల మతాలకి
అతీతం
సింహాసనం:
ఉద్యోగం కొత్తల్లో -
పది మంది మధ్యన
పని చేసే వాడిని
మనసు పంచు కునేందుకు
చుట్టూ మనసున్న మనుష్యులు
పై పదవులు వచ్చాయి -
చుట్టూ అడ్డగోడలు లేచాయ్
ఒంటరినై పోయాను
చుట్టూ మనసుల్లేవ్ - యంత్రాలే
వస్తూ పోతూ మతలబు మనుష్యలు
ఏమైనట్టు -
వెలి వేశారా?
బలి చేశారా?
నిరీక్షణ:
తెలిసింది
సాంత్వన
ఎక్కడ దొరుకుతుందో
—
ఓ కళలో
ఓ పనిలో
ఓ అలవాటులో
ఓ సహచరి/డు లో
తెలియందేంటంటే
అది
ఎప్పుడు దొరుకుతుందో…
భారీ లోటు:
మానవ వనరుల్ని
ఎగుమతి
చేస్తున్నాం
పశ్చిమ సంప్రదాయాల్ని
దిగుమతి
చేసుకుంటున్నాం
ఎగుమతుల
లాభం కంటే
దిగుమతుల
మూల్యం
ఎక్కువౌతోంది
ఏడాదేడాదికి
ఎవరు గొప్ప?:
చిన్నప్పుడు చదివిన పాఠం -
అవయవాలు
వంతులు పడితే
మనిషి ప్రాణం పోయింది
ఇప్పుడు నేర్చిన పాఠం -
కులమతాలు
పోటీ పడితే
మానవత్వం చచ్చింది
అత్యాచారాలు:
రెండు కళ్ళ ఎదుట
వ్రాసే ఉంది -
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం -
తాగుడు ఆగలేదు
పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం -
ఈ తాగుడూ ఆగలేదు
మూడు కళ్ళూ
మూసుకు పోయి చేసే పనికి
ఎక్కడ వ్రాసినా ఆరవు -
మానభంగ హోమాలు
పీడనం:
సముద్రం లోంచి వచ్చే
ఉప్పెనలకి ఎన్ని పేర్లో -
కత్రిన
రీన
ఎరిక
సునామీ
లైలా
ఇర్మా
సైమూర్
ఉలికా
వగైరా...వగైరా….
గుండె లోతుల్లోంచి
పొంగే కెరటాలకి
ఒకటే పేరు -
కన్నీళ్ళు
ఓటమి కోసం పోటీ:
గడియారంలో
ముల్లులకు పోటీ -
సెకనుల ముల్లు
గంటకు అరవై
చుట్లు చుట్టినా
దాని స్థానం
ఎప్పుడూ మూడోదే.
ఓ థెరిసా !:
ఆటల పోటీలు
మొదలు అవుతయ్
LOVE ALL తో !
జీవితపు ఆట
LOVES ALL తో
ముగిస్తే
ఎంత
సార్ధకత!
శలభాలు:
ఆకర్షిస్తున్నాయ్
విదేశీ కోలువులు
తిరిగి వచ్చేది
పెట్టెల్లో
సంపదలైతే
హర్షనీయం
పేటికల్లో
శరీరాలైతే
శోచనీయం
కూటి కోసం:
పుట్టిన బిడ్డకు
అలంకారాలు, ఆభరణాలు
పోయిన ప్రాణం కోసం
డప్పులు, నృత్యాలు
జననం నుంచి
మరణం దాకా
పేరేదైనా
అన్నీ ఉపాధి పధకాలే
పురోగామి:
నేర్చుకుంటే -
గడియారం దగ్గరా
విషయం ఉంది
ఎల్ల వేళలా
- ముందుకు సాగడమే
- అలుపొస్తే ఆగడం
మడమ .
తిప్పే
మాటే
లేదు.
Comments
Post a Comment